అజ్ఞాతంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్?.. అసలేమైంది?

Date:


International

-Jakki Mahesh

ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ప్రస్తుతం ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఆయన గాయపడ్డారని నిఘా సంస్థలు నమ్ముతున్నాయి. మొజ్తాబా ఖమేనీ సోమవారం సుప్రీం లీడర్‌గా ఎన్నికైనప్పటి నుండి బహిరంగంగా కనిపించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది. ఈ ఊహాగానాలు బుధవారం మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కుమారుడు యూసుఫ్ పెజెష్కియన్ టెలిగ్రామ్ యాప్‌లో ఓ పోస్ట్ చేశారు. “మిస్టర్ మొజ్తాబా గాయపడినట్లు నేను విన్నాను” అని ఆయన పేర్కొన్నారు. అయితే,స్నేహితులను సంప్రదించగా “అదృష్టవశాత్తూ, ఆయన బాగానే ఉన్నారు, ఎలాంటి సమస్య లేదు” అని యూసుఫ్ తెలిపారు. ఈ వివరాలపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.

విషాద ఘటన.. ఆరోగ్యంపై ప్రభావం

56 ఏళ్ల మొజ్తాబా ఖమేనీ గత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు. ఆయన ఇరాన్‌లో ఓ కీలక వ్యక్తిగా ఉన్నారు. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28న జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మొజ్తాబా తండ్రి, భార్య మరణించారు. ఈ విషాద ఘటన ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.

నిఘా వర్గాల అంచనా

ఇజ్రాయెల్ సీనియర్ అధికారి రాయిటర్స్‌కు తెలిపినట్లు, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త వైమానిక దాడిలో గాయపడ్డారని, అందుకే ప్రజల ముందు కన్పించడం లేదని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మొజ్తాబాను సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవాలని బలవంతం చేసిందని ఇజ్రాయెల్ పేర్కొంది. ఆయన తండ్రి కఠిన విధానాలకు మద్దతిస్తారని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నమ్ముతోంది.

సుప్రీం లీడర్ గాయపడ్డారా?

ముగ్గురు ఇరాన్, ఇద్దరు ఇజ్రాయెల్ అధికారుల మాటల ప్రకారం, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల మొదటి రోజునే మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. సుప్రీం లీడర్‌గా ఎంపికై మూడు రోజులైనా, ఆయన ఎక్కడ ఉన్నారు, ఆయన ఎన్నిక పరిస్థితులు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. ఇప్పటివరకు మొజ్తాబా ప్రజల ముందుకు రాలేదు లేదా వీడియో, రాతపూర్వక ప్రకటనను విడుదల చేయలేదు. ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానెళ్లలో మొజ్తాబా ఖమేనీ పాత ఫుటేజ్ మాత్రమే ప్రసారమవుతోంది. ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం, 56 ఏళ్ల ఈ మతగురువు, ఇరాన్ ప్రభుత్వం “రంజాన్ యుద్ధం”గా పేర్కొంటున్న యూఎస్-ఇజ్రాయెల్ దాడులలో గాయపడినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వ టీవీ ఆయనను “రంజాన్ కా జాంబాజ్” (యుద్ధంలో గాయపడిన యోధుడు) అని సంబోధిస్తోంది, ఇది గాయపడ్డారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

ఇరాన్ ప్రభుత్వ టీవీ వ్యాఖ్యాతలు మొజ్తాబా ఖమేనీని ‘రంజాన్ యుద్ధం’లో గాయపడిన యోధుడిగా అభివర్ణిస్తున్నారు. ఈ వివరాలపై సమాచారం లేకపోవడంతో ఆయన శారీరక పరిస్థితిపై ప్రజలలో ఊహాగానాలను పెంచింది. మొజ్తాబా తండ్రి, మాజీ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ, ప్రజలకు తరచుగా టీవీ, వీడియో సందేశాలు ఇచ్చేవారు, బహిరంగ సభలలో పాల్గొనేవారు. ఆ విధంగా మొజ్తాబా ఇప్పటివరకు తన ప్రసంగం ఇవ్వకపోవడంతో ప్రజల్లో ఊహాగానాలు పెరిగిపోయినట్లు తెలుస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related