Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. వ్యవసాయ రంగానికి అన్నదాత సుఖీభవ పథకం కింద మూడవ విడత నిధులు రేపు విడుదలవుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు ఇప్పటివరకు 7.5 కోట్ల భోజనాలు అందించినట్టు చంద్రబాబు పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ లతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరు ప్రజలకు వాటి లబ్ధి సక్రమంగా చేరే విధానం పైన జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరవ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పలు కీలక అంశాలపైన అధికారులకు సూచనలు చేసిన ఆయన సూపర్ సిక్స్ పథకాలతో పాటు, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
లబ్దిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు
పథకాల లబ్ధిదారులకు, ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏ పథకం ద్వారా ఎంత ప్రయోజనం చేకూరిందో ఈ లేఖల ద్వారా స్పష్టంగా తెలుస్తుందని, ఇది వ్యవస్థలో పారదర్శకతను మరింత పెంచుతుందని చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం అందించే పెన్షన్, ఉచిత సిలిండర్, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల వివరాలు లబ్ధిదారులకు స్పష్టంగా చేరాలని సీఎం పేర్కొన్నారు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణం పైన సీఎం వ్యాఖ్యలు
డి బి టి అమలులో సాంకేతికతను వినియోగించాలని పేర్కొన్న చంద్రబాబు దీపం 2.0 స్కీంకు డిజిటల్ వోచర్లు పరిశీలించాలని తెలిపారు. ప్రోగ్రామబుల్ వోచర్లు లబ్ధిదారుల అవసరాలకు ఉపయోగపడతాయని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం పైన సీఎం చంద్రబాబు వివరాలను వెల్లడించారు. మార్చి 9 నాటికి 50.45 కోట్ల ప్రయాణాలు జరిగాయని, ఇప్పటివరకు ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ కి 1775 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేసిందని చంద్రబాబు తెలిపారు.
సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక క్యాలెండర్
పేదరిక నిర్మూలనకు చేపట్టిన p4 సహా, జీరో పావర్టీ కార్యక్రమాన్ని డ్వాక్రా మెప్మా సంఘాలతో సమర్థవంతంగా అమలు చేయాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. త్వరలో సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక క్యాలెండర్ ను ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాదు సామాజిక రంగంలో అంగన్వాడీలకు, ఆశా కార్యకర్తలకు గ్రాట్యూటీ అమలు చేస్తామని తెలిపిన చంద్రబాబు పథకాల లాస్ట్ మైల్ డెలివరీ లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలన్నారు.
ఉగాదికి 2.5 లక్షల మందికి సామూహిక గృహప్రవేశాలు
రాష్ట్ర రోడ్ల మరమ్మతులకు 1000 కోట్ల రూపాయలు, గ్రామీణ పల్లె పండుగ ప్రోగ్రాం కింద నాలుగు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నిరుపేదల ఇళ్ల సమస్యల పైన ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేయడం లేదా ఇంటి స్థలం ఇవ్వడం చేస్తామని చెప్పారు. ఉగాదికి 2.5 లక్షల మందికి సామూహిక గృహప్రవేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ప్రతీ ఇంటికి ఇంటర్నెట్, తాగు నీరు
జల జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా పనులు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. గ్రామాలలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టాలని సూచించారు. 500 పాఠశాలల్లో ‘నెట్ జీరో కాన్సెప్ట్’తో కిచెన్ గార్డెన్‌లు ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు తెలిపారు.
వీబీజీ రామ్ జీ పథకం క్రింద ఏపీకి 9773 కోట్ల రూపాయలు
కేంద్రం ‘వీబీజీ రామ్ జీ పథకం’ కింద ఆంధ్రప్రదేశ్‌కు 9773 కోట్ల రూపాయలు కేటాయించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ పథకంలో నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. పెట్టుబడులతో పాటు పేదల సంక్షేమం, సాధికారతకు అదే స్థాయిలో ఆలోచించాలని కలెక్టర్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.


