Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అల్టిమేట్ ఇచ్చారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేర్చాలని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల మరోమారు పోరుబాట పట్టారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఫిబ్రవరి 24వ తేదీన చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనకు శ్రీకారం చుట్టారు.ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అధికారికంగా ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా, తమ ఉనికిని హక్కులను చాటుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలు ఉన్నాయన్నారు.
ఆర్టీసీ చలో సెక్రటేరియట్ కార్యక్రమం
గతంలో తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, వెంటనే హామీలను అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. చలో సెక్రటేరియట్ కార్యక్రమం ద్వారా ఉద్యోగులు కార్మికులు భారీ సంఖ్యలో హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్దకు చేరుకొని తమ నిరసన తెలియజేస్తామని, ప్రభుత్వానికి తమ గోడును విన్నవించుకుంటామని, ఈ పోరాటంలో ఎటువంటి హింసకు తావులేదన్నారు.
అడ్డుకుంటే జరిగేదిదే
పూర్తిగా శాంతియుతంగా గాంధేయ మార్గంలోనే తమ నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో, పోలీసులు, కార్మికుల ప్రజాస్వామ్య హక్కును గౌరవించి అడ్డుకోకుండా ఉంటే మంచిదని సూచించారు. శాంతియుతంగా తాము చేసే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తే పరిస్థితి తీవ్రంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
ఆర్టీసీ బస్సులను ఎక్కడివి అక్కడే నిలిపివేసి విధులు బహిష్కరిస్తాం
ఆందోళనకారులను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను ఎక్కడివి అక్కడే నిలిపివేసి విధుల బహిష్కరణ చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. రవాణా వ్యవస్థ స్తంభిస్తే ప్రభుత్వానిదే బాధ్యత అని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని వారన్నారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు.


