Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడి పశువులను పోషించే వారికి, చిన్న తరహా డెయిరీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పట్టణ ప్రాంతాలలో పశుపోషణ ప్రోత్సాహానికి, రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం బెటర్మెంట్ మరియు డెవలప్మెంట్ చార్జీలను రద్దు చేసింది. ఇక ఈ నిర్ణయం పశు పోషకులకు, చిన్న తరహా డెయిరీలు నిర్వహించే వారికి శుభవార్త అని చెప్పవచ్చు.
పట్టణ ప్రాంత డెయిరీలకు, పశు పోషకులకు చార్జీల నుంచి పూర్తి మినహాయింపు
రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈ నిర్ణయం తాలూకు వివరాలను వెల్లడించారు. పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో ప్రకారం పట్టణ, స్థానిక అభివృద్ధి సంస్థల పరిధిలోని డెయిరీలు, గొర్రెలు, మేకలు, పందుల యూనిట్లు, ఇతర పశుసంవర్ధక ఫారాలకు ఈ చార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.
పశు పోషణపైన ఆధారపడిన రైతులకు ఆర్థిక భారం తగ్గుతుందన్న మంత్రి
పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు, ఇది పశు పోషకులకు, చిన్న రైతులకు ఊరటనిస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల పట్టణాలలో పశు పోషణపైన ఆధారపడిన రైతులకు ఆర్థిక భారం తగ్గుతుందని, వారి జీవన ప్రమాణం మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది స్వయం ఉపాధిని కల్పించడంతోపాటు ఆర్థిక సమృద్ధికి కూడా దారితీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
భవన అనుమతి కోసం లైసెన్సు రుసుమును గ్రామాల స్థాయికి తగ్గించిన సర్కార్
ఈ ఫామ్ లను ఏర్పాటు చేయడానికి భవన అనుమతి కోసం లైసెన్సు రుసుమును అర్బన్ లో కూడా గ్రామపంచాయతీలకు సమానంగా నిర్ణయించారు. ఈ చర్య పట్టణ ప్రాంతంలో ఉన్న పశు పోషకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత జూన్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
ఏపీలో లైసెన్స్ ప్రక్రియ సులభతరం
మున్సిపాలిటీల పరిధిలో పశు పోషకులు, చిన్న తరహా డెయిరీ నిర్వాహకులకు అధిక డెవలప్మెంట్ చార్జీలతో, షెడ్ లకు అనుమతులతో గతంలో అనేక రకాల ఇబ్బందులు ఉండేవి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లైసెన్స్ ప్రక్రియ సులభతరం అవుతుంది. దీని ద్వారా వారికి వేల రూపాయలు ఆదా అవుతుంది. ఇది నిజంగా పట్టణ ప్రాంతంలోని పశు పోషణ చేస్తున్న రైతులకు శుభవార్త అని చెప్పవచ్చు.


