India
oi-Lingareddy Gajjala
వంటగ్యాస్ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు, బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) కీలక నిర్ణయం తీసుకుంది. సిలిండర్ బుకింగ్‌లో ఎలాంటి సాంకేతిక అంతరాయాలు కలగకుండా ఉండేందుకు సరికొత్త హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా స్మార్ట్‌ఫోన్ వాడకం తక్కువగా ఉన్న వినియోగదారుల సౌకర్యార్థం మిస్డ్ కాల్ సేవను ఐఓసీఎల్ బలోపేతం చేసింది. వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధానమైన (రిజిస్టర్డ్) మొబైల్ నంబర్ నుంచి 8927225667 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా క్షణాల్లో సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల కాల్ ఛార్జీల భారం ఉండదు.
IVRS, పాత నంబర్ల కొనసాగింపు
నేరుగా ఫోన్ కాల్ ద్వారా బుక్ చేయాలనుకునే వారి కోసం 8391990070 అనే ఐవీఆర్ఎస్ (IVRS) నంబర్‌ను సంస్థ కేటాయించింది. అయితే, ప్రస్తుతం వాడుకలో ఉన్న పాత బుకింగ్ నంబర్లు కూడా యథావిధిగా పనిచేస్తాయని, వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది. అదనపు నంబర్ల వల్ల పీక్ అవర్స్ (ఎక్కువ మంది బుక్ చేసే సమయం)లో సర్వర్లపై ఒత్తిడి తగ్గి, బుకింగ్ వేగంగా పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
డిజిటల్ బుకింగ్‌కు ప్రాధాన్యత
కేవలం మిస్డ్ కాల్, ఫోన్ కాల్ మాత్రమే కాకుండా.. వాట్సాప్ ద్వారా కూడా ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. వినియోగదారులు ‘REFILL’ అని టైప్ చేసి 7588888824 నంబర్‌కు వాట్సాప్ సందేశం పంపడం ద్వారా బుకింగ్ స్థితిని తెలుసుకోవచ్చు. అలాగే ఐఓసీఎల్ వారి అధికారిక వెబ్‌సైట్ మరియు ‘Indane’ మొబైల్ యాప్ ద్వారా కూడా నగదు చెల్లించి బుక్ చేసుకోవచ్చని సంస్థ సూచించింది.


