International
-Bomma Shivakumar
ఇరాన్ పై యుద్ధంలో ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్, అమెరికాతో చేతులు కలపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక పిలుపునిచ్చారు. టెల్ అవీవ్ పై ఇటీవల టెహ్రాన్ దాడులను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్.. ప్రపంచదేశాలకు ముప్పు అని అన్నారు. ఇరాన్.. ఇజ్రాయెల్, అంతర్జాతీయ సమాజానికి ప్రమాదకరమని నెతన్యాహు స్పష్టం చేశారు. ఎక్స్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఆయన.. “గత 48 గంటల్లో ఇరాన్ నాగరికతకు శత్రువు అని, స్వేచ్ఛా ప్రపంచానికి ప్రమాదకరమని మరోసారి నిరూపించింది” అని వ్యాఖ్యానించారు.
నెతన్యాహు ఇంకా మాట్లాడుతూ.. ఇరాన్ “పిల్లలను, కుటుంబాలను, వృద్ధులను ఉగ్రవాద క్షిపణులతో లక్ష్యంగా చేసుకుంది, జెరూసలేంలోని పవిత్ర స్థలాలను బెదిరించింది, దీర్ఘ-శ్రేణి క్షిపణులను ప్రయోగించింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ప్రపంచాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోంది” అని వివరించారు. ప్రపంచ నాయకులనుద్దేశించి నెతన్యాహు “స్వేచ్ఛా ప్రపంచ నాయకులారా: మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు? ఇజ్రాయెల్ తన కోసం మాత్రమే కాదు, మీ అందరి కోసం పోరాడుతోంది” అని ప్రశ్నించారు. టెహ్రాన్ అంతర్జాతీయ సముద్ర, ఇంధన రవాణా మార్గాలను అడ్డుకుంటూ ప్రపంచాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తోందన్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ లు టెహ్రాన్ పై యుద్ధం ప్రకటించి, సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు నాయకులను హతమార్చిన తర్వాత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ను మూసివేసింది. ప్రపంచ చమురులో దాదాపు ఐదవ వంతు రవాణా చేసే ఈ కీలక జలమార్గం మూసివేత గత కొన్ని వారాలుగా ప్రపంచ ఇంధన మార్కెట్లను కలవరపెట్టింది. ఇరాన్ కు వ్యతిరేకంగా విస్తృత అంతర్జాతీయ చర్యలను కోరుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పిలుపును నెతన్యాహు స్వాగతించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లకే కాకుండా, ప్రపంచ భద్రతను కాపాడటానికి ఇది అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
శనివారం, ఇరాన్ ఇజ్రాయెల్‌లోని అరాద్, డిమోనా నగరాలపై క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల్లో పౌరులు, మౌలిక సదుపాయాలు లక్ష్యంగా మారాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకారం, అరాద్‌లో జరిగిన క్షిపణి దాడిలో కనీసం 80 మంది గాయపడ్డారు. పిల్లలతో సహా మొత్తం 100 మంది క్షతగాత్రులయ్యారు. ఈ బాలిస్టిక్ క్షిపణి దాడులు నివాస ప్రాంతాలకు భారీ నష్టం కలిగించాయి. మీడియా నివేదికల ప్రకారం, టెహ్రాన్‌లోని నటాంజ్ అణు కర్మాగారంపై ఇంతకు ముందు జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడులు జరిగాయి.
నెతన్యాహు పిలుపునిచ్చిన కొన్ని రోజుల ముందు, టెహ్రాన్ హిందూ మహాసముద్రంలోని డీగో గార్సియాలోని అమెరికా-యుకె సంయుక్త స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. కీర్ స్టార్మర్ ఇరాన్‌పై దాడులకు బ్రిటిష్ స్థావరాలను ఉపయోగించుకోవడానికి అమెరికాకు అనుమతిచ్చిన వెంటనే ఆ చర్యను టెహ్రాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి ఖండించారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి అమెరికా SM-3 అడ్డుకోగా, మరొకటి గాలిలోనే విఫలమైంది. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం లేనప్పటికీ, టెహ్రాన్ గతంలో తెలియని సైనిక సామర్థ్యాలను వెల్లడి చేసింది. డీగో గార్సియా టెహ్రాన్ నుండి 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, ఇరాన్ క్షిపణి పరిధి 2,000 కిలోమీటర్లు మాత్రమే అని గతంలో పేర్కొంది.


