International
oi-Chandrasekhar Rao
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.
ఈ యుద్ధంలో ప్రారంభంలోనే ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దీని తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ కు కొత్త సుప్రీమ్ లీడర్ నియమితులయ్యారు. ఖమేనీ వారసుడు ఖరారయ్యారు. ఇరాన్ తదుపరి సుప్రీమ్ గా మొజ్తబా ఖమేనీ అపాయింట్ అయ్యారు. ఖమేనీ పెద్ద కుమారుడు మొజ్తాబా. ఒకట్రెండు రోజుల్లో బాధ్యతలను స్వీకరించనున్నారు. అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఖాళీ అయిన దేశ నాయకత్వ పగ్గాలు మొజ్తాబా చేతికి అధికారికంగా అప్పగించినట్లు ఇరాన్ అసెంబ్లీ వెల్లడించింది.
మోజ్తబా ఖమేనీ 1969లో మషద్ లో జన్మించారు. మతపరమైన ఉన్నత విద్యను అభ్యసించారు. ఇరాన్-ఇరాక్ యుద్ధం చివరి దశలో ‘రివల్యూషనరీ గార్డ్’లో పనిచేశారు. తండ్రికి కుడిభుజంగా వ్యవహరించారు. అనేక విషయాల్లో తెర వెనుక ఉండి చక్రం తిప్పారనే పేరుంది. పాలనపరంగా తీసుకునే పలు కీలక నిర్ణయాల్లో మొజ్తబా ఖమేనీ ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతారు. రివల్యూషనరీ గార్డ్ తర్వాత ఎప్పుడూ కూడా పెద్దగా తెరమీదికి రాలేదు.
అలాగే ప్రభుత్వ పదవిలోనూ పని చేసిన అనుభవం ఆయనకు లేదు. అయినప్పటికీ- మోజ్తబా తన తండ్రికి విశ్వసనీయ సలహాదారుగా కొనసాగారు. సైన్యం, పారామిలిటరీ దళాలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. 2009లో జరిగిన నిరసన ప్రదర్శనల్లోనూ మోజ్తబా ఖమేనీ పేరు వార్తల్లో నిలిచింది. ఆందోళనలను కఠినంగా అణచివేయడంలో ఆయన భూమిక పోషించారనే ఆరోపణలు అప్పట్లో ఆయనపై వెల్లువెత్తాయి.
ఇప్పుడు ఆయన సుప్రీం లీడర్‌గా మారడంతో దేశంలో కొత్త రాజకీయ చర్చ మొదలైంది. 1979 విప్లవం వారసత్వ అధికారాన్ని వ్యతిరేకించింది. అందువల్ల, కొందరు ఆయన ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం, సైనిక మద్దతు ఆయనకు బలాన్ని అందిస్తుండటంతో, మోజ్తబా ఖమేనీని శక్తివంతమైన నాయకుడిగా పరిగణిస్తున్నారు. మొజ్తాబా నియామకం వెనుక ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో ‘రివల్యూషనరీ గార్డ్’లో పనిచేసిన అనుభవం ఉన్నందున మొజ్తబానే సుప్రీం లీడర్ గా ఎన్నుకోవాలని ఐఆర్జీసీ ఒత్తిడి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉండటం, సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించడానికి మొజ్తాబా అయితేనే బాగుంటుందని ఐఆర్జీసీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.


