ఉన్నట్టుండి అర్చకులు, మౌజమ్ ల గౌరవ భృతి పెంపు

Date:


India

oi-Chandrasekhar Rao

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుండి కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అర్చకులు, మౌజమ్ ల గౌరవ వేతనాన్ని పెంచింది. వారికి అందజేస్తోన్న గౌరవ భృతిని సవరించింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాదిమంది అర్చకులు, మౌజమ్ లకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించినట్టయింది. ఆధ్యాత్మిక, సామాజిక జీవితాన్ని గడపడానికి, మరింత గౌరవప్రదంగా వారు జీవించడానికి వెసలుబాటు కలుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

అర్చకులు, మౌజమ్ ల గౌరవ భృతి పెంచుతున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని పురోహితులు, మౌజమ్ లకు ఇచ్చే నెలవారీ గౌరవ వేతనాన్ని 500 రూపాయలు పెంచుతున్నట్లు వెల్లడించారు. వీరి సేవలు మన సమాజాల ఆధ్యాత్మిక, సామాజిక జీవితాన్ని నిలబెడతాయని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు వారు నిబంధనలకు లోబడి సమర్పించిన అన్ని తాజా దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.

మతపరమైన కార్యక్రమాలలో పాలుపంచుకునే వారి పాత్రను గుర్తించేందుకు ప్రభుత్వ నిబద్ధతతో ఉందని, దానికి ఇదే ఉదాహరణ అని మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. ప్రతి సమాజం, ప్రతి సంప్రదాయం విలువైనదిగా, దాన్ని బలోపేతం చేసే వాతావరణాన్ని ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని, అటువంటి చర్యలు తమకు గర్వకారణమని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఆధ్యాత్మిక సంప్రదాయాలను పరిరక్షించే వారికి తగిన గుర్తింపు, మద్దతు ఇవ్వడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆమె వివరించారు.

నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించడానికి సరిగ్గా రెండు గంటల ముందే మమత బెనర్జీ ఈ పెంపును ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని తెలిసిందే. ఎన్నికలు ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. ఈ రాష్ట్రంతో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరీ ఉన్నాయి.

ఈ షెడ్యూల్ జారీ చేయడానికి ఈ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించనుంది. ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తే ప్రభుత్వాలు కొత్త విధాన ప్రకటనలు లేదా ఓటర్లను ప్రభావితం చేసే ఆర్థికపరమైన ప్రకటనలు చేయడానికి వీలుండదు. ఈ నేపథ్యంలో మమత బెనర్జీ హఠాత్తుగా గౌరవ వేతనాల పెంపు, కొత్త దరఖాస్తుల ఆమోదం వంటి ప్రకటనలు చేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related