India
-Bomma Shivakumar
దేశవ్యాప్తంగా వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, ఈదురు గాలులకు సంబంధించి ఐఎండీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ తరహా వాతావరణం ఉంటుందని అంచనా వేసింది. తూర్పు, మధ్య, ఈశాన్య భారత్ లో వాతావరణ పరిస్థితులు తీవ్రం అవుతాయని ఐఎండీ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.
భారీ వర్షపాతం, ఉరుములతో కూడిన గాలులు, వడగళ్ల వానలకు అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మార్చి 21 నుంచి 24 మధ్య సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలో విస్తారమైన వర్షాలు పడతాయని.. మార్చి 21న కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంగా పరివాహక ప్రాంతం, పశ్చిమ్ బెంగాల్ లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఒడిశాలో 70 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు వడగళ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఉరుములతో కూడిన జల్లులు, బలమైన గాలులతో కూడిన వర్షపాతం ఉండనుంది. అలాగే అసోం, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ లో మార్చి 24న అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. తూర్పు, మధ్య భారత్ లోని బిహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే కొద్ది రోజులు చెదురుమదురు వర్షాలు, బలమైన గాలులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.
ఇక వాయువ్య భారత్ లో తడి వాతావరణం నెలకొని ఉంది. మార్చి 23న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, హిమపాతం కురిసే అవకాశం ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్ లో కూడా విస్తారమైన వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది . పెద్ద ఎత్తున ఉరుములతో కూడిన జల్లులు దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త అఖిల్ శ్రీవాస్తవ ఏఎన్ ఐ వార్తా సంస్థకు తెలిపారు.
శ్రీవాస్తవ మాట్లాడుతూ.. “దిల్లీలో నిన్న వర్షాలు కురవడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఈ సాయంత్రం కూడా ఇదే విధమైన వర్షపాతం సంభవించే అవకాశం ఉందని మా అంచనా. అయితే, రేపటి నుంచి దిల్లీలో ఈ వాతావరణం తగ్గుముఖం పట్టి, వర్షాల సంభావ్యత క్రమంగా తగ్గుతుంది” అని వివరించారు. శనివారం ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉంటుందని.. మరుసటి రోజు పాక్షికంగా మేఘమయంగా మారుతుందని శ్రీవాస్తవ జోడించారు. “నిన్నటితో పోలిస్తే, ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలలో సుమారు 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గుదల ఉండొచ్చు. అయినప్పటికీ, రేపటి తర్వాత ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగడం ప్రారంభిస్తాయి” అని ఆయన వివరణ ఇచ్చారు.
తూర్పు ఉత్తర్ ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలకు ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగళ్ల వానల ముప్పు ఉన్నందున ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ అయిందని ఐఎండీ శాస్త్రవేత్త ధృవీకరించారు. “తూర్పు భారత్ లో గాలుల వేగం గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు చేరొచ్చు. ఇది ప్రమాదకరం” అని శ్రీవాస్తవ హెచ్చరించారు. దక్షిణ భారత్ లో, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు పలు రాష్ట్రాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, తీరప్రాంత కర్ణాటక, గోవా, కేరళలో మాత్రం వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది.


