Telangana
oi-Bomma Shivakumar
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలోని 2,981 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. అయితే అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా అంటూ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫలితాలను పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది.
మున్సిపల్ ఎన్నికల్లో 7 కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెంను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. నిజామాబాద్, కరీంనగర్ ను బీజేపీ దక్కించుకుంటుందని, బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్ నూ సొంతం చేసుకోలేదని స్పష్టం చేసింది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 68- 76 సీట్లు, బీఆర్ఎస్ 29- 36 సీట్లు, బీజేపీ 3- 5 సీట్లు అలాగే ఎంఐఎం 0 నుంచి ఒక్క సీటు ఇక ఇతరులు 8- 14 సీట్లు దక్కించుకుంటారని స్పష్టం చేసింది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం.. అధికార కాంగ్రెస్ పార్టీకి 36 శాతం ఓట్లు వచ్చినట్లు సర్వే తేల్చింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 29.7 శాతం, బీజేపీ పార్టీకి 19.3 శాతం, ఎంఐఎం పార్టీకి 2 శాతం అలాగే ఇతరులకు 9.7 శాతం ఓటింగ్ వచ్చినట్లు పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. ఇక మొత్తం 2,981 వార్డుల్లో పోలింగ్ నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీ 1210 నుంచి 1290 వార్డులు కైవసం చేసుకోనున్నట్లు అంచనా వేసింది. అలాగే బీఆర్ఎస్ 860 నుంచి 930, బీజేపీ 250 నుంచి 270, ఎంఐఎం 35 నుంచి 44, ఇతరులు 90 నుంచి 110 వార్డులను కైవసం చేసుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా 60 శాతానికి మించి పొలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనావేస్తున్నారు. ఫిబ్రవరి 13 వ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.


