Andhra Pradesh
oi-Chandrasekhar Rao
నడివేసవిలో ఏపీని వర్షాలు పలకరిస్తోన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్నటివరకు ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ పలు చోట్ల చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎండ వేడి నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించినప్పటికీ- రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. మామిడి పంట చేతిెకి అందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు కొంతమేర దెబ్బకొట్టాయి.
ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మరింత విస్తరించింది. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడొచ్చని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడొచ్చు.
ఇదే పరిస్థితి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా కనిపించే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడొచ్చని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఆయా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నేడు కూడా కొనసాగుతుందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పిడుగులు పడే సమయంలో రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో పొలంలో ఉండరాదని సూచించారు. ప్రజలు చెట్ల క్రింద నిల్చోకూడదని అన్నారు.


