ఐదేళ్ల తర్వాత అదరహో.. లాభాల బాటలో మిరప రైతులు!

Date:


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

గత ఐదేళ్లుగా కన్నీళ్లే మిగిల్చిన మిరప సాగు, ఈ ఏడాది రైతు మోములో చిరునవ్వులు పూయిస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, సాగు భారమై ‘కాడి’ వదిలేద్దామనుకున్న తరుణంలో.. మార్కెట్‌ ఒక్కసారిగా పుంజుకుంది. జనవరి నుంచి మొదలైన ధరల జోరు, ప్రస్తుతం రైతుల ఇంట సిరుల పండుగను తెస్తోంది. క్వింటాలుకు సగటున రూ. 20 వేల వరకు ధర పలుకుతుండటంతో, ఇన్నాళ్లూ నష్టాల సెగతో కుంగిపోయిన అన్నదాతకు ఈ ఏడాది నిజమైన ఊరట లభిస్తోంది.

గతంలో రైతులు తమ పంటను అమ్ముకోవడానికి మార్కెట్లకు పరుగులు తీసేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అంతర్జాతీయంగా మిరపకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో, వ్యాపారులే నేరుగా గ్రామాల బాట పడుతున్నారు. జనవరితో పోలిస్తే క్వింటాలుకు రూ. 5 వేలకు పైగా ధర పెరగడం విశేషం.

ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సాగు తగ్గడం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు యార్డుకు వస్తున్న సరుకు వచ్చినట్టుగానే అమ్ముడవుతుండటం మార్కెట్ సందడిని తెలియజేస్తోంది.

అదరహో అంటున్న ధరలు!

ఒకప్పుడు పెద్దగా ఆదరణ లేని సన్నరకాలకు ఇప్పుడు ఎక్కడలేని డిమాండ్ పెరిగింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ. 15 వేల వద్ద ఉన్న ‘తేజ’ రకం ధర, ప్రస్తుతం రూ. 19,500కు చేరువయ్యింది. నాణ్యత తక్కువగా ఉండే ‘తాలు’ రకం కూడా క్వింటాలుకు రూ. 10 వేల పైనే పలుకుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఆశాజనకంగా ఉండటంతో కోతలు పూర్తికాగానే రైతులు వెంటనే ఆరబెట్టి మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీనివల్ల శీతల గోదాములకు వెళ్లే నిల్వలు కూడా ఈసారి తగ్గే అవకాశం కనిపిస్తోంది.

పెట్టుబడి భారమే.. కానీ ధరతో ఊరట!

మిరప సాగు ఈసారి రైతులకు సవాలుగానే మారింది. నల్లతామర పురుగు, జెమిని వైరస్ ఉద్ధృతిని తట్టుకోవడానికి వారానికి మూడు, నాలుగు సార్లు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. దీనివల్ల ఎకరాకు పెట్టుబడి ఏకంగా రూ. 4 లక్షల వరకు చేరింది. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల ప్రకారం ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. సగటున రూ. 4.50 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గతేడాది క్వింటాలుకు రూ. 10 వేల లోపే ధర పలకడంతో కుంగిపోయిన రైతుకు, ఈసారి దక్కుతున్న రూ. 18 వేల నుంచి రూ. 20 వేల ధర కష్టాన్ని మరిపిస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related