India
oi-Chandrasekhar Rao
ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తోన్నారు. షార్ట్ సర్క్యుట్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తోన్నారు.
కటక్‌లో ఉన్న ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో ఈ వేకువ జామున 2:30 నుంచి 3 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ట్రామా కేర్ ఐసీయూలో చెలరేగిన ఈ మంటల బారిన పడి 10 మంది రోగులు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. వారిలో వైద్య సిబ్బంది సైతం ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐసీయూలో చికిత్స పొందుతున్న 23 మంది రోగులను ఆసుపత్రిలోని ఇతర వార్డులకు తరలించారు.
మరణించిన 10 మంది రోగులలో ఏడుగురు ఇతర ఐసీయూలు/వార్డులకు తరలించే క్రమంలో మరణించగా, మరో ముగ్గురు ఆ తర్వాత కన్నుమూశారు. రోగులను కాపాడే ప్రయత్నంలో కొందరు సిబ్బందికి కాలిన గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యుట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తోన్నారు. మంటలు త్వరితగతిన వ్యాప్తి చెందడానికి దోహదపడే కెమికల్స్, ఇతర వస్తువులు ఐసీయూలో ఉండటం వల్ల క్షణాల్లో అవి వ్యాపించాయి.
తొలుత దట్టమైన పొగ వెలువడింది. ఆ వెంటనే సిబ్బంది అప్రమత్తం అయ్యారు. చికిత్స పొందుతున్న వారిని ఇతర వార్డులకు షిఫ్ట్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ మహాలింగ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది, రోగుల బంధువులతో కలిసి అగ్నిమాపక సిబ్బంది ఐసీయూలోని రోగులను సురక్షితంగా తరలించారు. ఆసుపత్రిని సందర్శించిన సీఎం మాఝీ, అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు మాఝీ తెలిపారు. గాయపడిన రోగులకు మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.


