14 ప్రాంతాల్లో ఏర్పాటుకు సైబరాబాద్ పోలీసుల నిర్ణయం
24 గంటల పాటు పర్యవేక్షణ రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై అతివేగం, రాంగ్ సైడ్ పార్కింగ్, లేన్ డ్రైవింగ్ అతిక్రమణ, డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. వీటి నివారణకు సైబరాబాద్ పోలీసులు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీసీ)లు సంయుక్తంగా కార్యాచరణకు దిగాయి. 24 గంటల పాటు ఔటర్‌పై నిఘా ఉంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఓఆర్‌ఆర్ పొడవు ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించిన పోలీసులు.. 14 ప్రాంతాల్లో ఏఐ ఆధారిత మల్టీ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్‌లను (AI-based multi-violation detection system) ఏర్పాటు చేయనున్నారు. ఇందులోని ఎలక్ట్రానిక్ మానిటరింగ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిస్టమ్ (ఈఎంఈఎస్) సాంకేతికత ద్వారా ప్రమాదాలకు కారణం, కారకులను గుర్తించడానికి వీలు కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు.
లేన్ డ్రైవింగ్..
నగరం చుట్టూ 158 కి.మీ మేరకు ఓఆర్‌ఆర్ విస్తరించి ఉంది. ఈ రోడ్డుకు 25 ఎగ్జిట్ పాయింట్లున్నాయి. ఔటర్‌పై ఒక్కో లైన్‌లో ఒక్కో వేగంతో వెళ్లడానికి అవకాశం ఉన్నా.. డ్రైవర్లు ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేయడం, అనుమతి లేని ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, సీట్ బెల్ట్ (Seat Belt) పెట్టుకోకపోవడం, అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి రకరకాల కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళలో జరిగే ప్రమాదాలకు కారణాలను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారడంతో ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో వాహనాల డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అనేది స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. అలాగే ఔటర్‌పై స్లో, స్పీడ్ మూమెంట్ వాహనాలను సులువుగా గుర్తించవచ్చు.
చదవండి: 27 మున్సిపాలిటీల విలీనానికి వేగంగా అడుగులు
పెట్రోలింగ్ టీమ్‌కు మెసేజ్..
ఏఐ కెమెరాల్లోని సాంకేతికతతో ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్, మోడల్, క్లాసిఫికేషన్‌ను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా గుర్తించి ఈ– చలానాలు వేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే సాంకేతికత ద్వారా ఏ ప్రాంతంలోనైనా అనధికారంగా వాహనాలను పార్కింగ్ చేసి ఉన్నా వెంటనే స్థానిక పెట్రోలింగ్ టీమ్‌కు మెసేజ్‌ను పంపిస్తుంది. వాహనాల కదలికలను గుర్తించి, ప్రమాదాలు జరిగితే అంబులెన్స్‌లను అలర్ట్ చేసే టెక్నాలజీ కూడా ఏఐ కెమెరాలకు ఉంటుంది.


