Telangana
oi-Sai Chaitanya
ఎమ్మెల్యేలు దానం నాగేందర్.. కడియం శ్రీహరి అనర్హత పై స్పీకర్ తేల్చేసారు. సుదీర్ఘ కాలం సాగిన వాదనల తరువాత స్పీకర్ ఈ రోజు నిర్ణయం వెల్లడించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన వారి పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసారు. స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావటంతో… త్వరగా తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సుప్రీంను ఆశ్రయించింది. ఫలితంగా సుప్రీం సూచనల మేరకు స్పీకర్ విచారణ పూర్తి చేసారు. ఈ ఇద్దరి విషయంలో ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారుతోంది.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్ .. కడియం శ్రీహరి అనర్హత పిటీషన్ల పైన స్పీకర్ తన నిర్ణయం ఎట్ట కేలకు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో, నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. మొత్తం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కోగా, వారిని విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్, ఇప్పటికే ఎనిమిది మందికి క్లీన్‌చిట్ ఇచ్చిన ఇచ్చారు. కాగా.. ఇక దానం, కడియంల విషయంలో వాదనలు పూర్తయ్యాయి. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మార్చి 12వ తేదీలోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాల్సివుంది. గత లోక్ సభ ఎన్నికల్లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆమె ఎన్నికల ప్రచారంలో కడియం అంతా తానై వ్యవహరించారు. అంతేకాదు కూతురు గెలుపు కోసం తన వంతుగా కృషి చేశారు. మరోవైపు దానం నాగేందర్ ఏకంగా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పోటీ చేసారు. దీంతో, ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచింది.
సుప్రీంలో విచారణ వేళ స్పీకర్ నిర్ణయం
ఈ ఇద్దరిని విచారణ చేసిన స్పీకర్ ఇప్పుడు నిర్ణయం వెల్లడించారు. ఈ ఇద్దరి పైన దాఖలైన అనర్హత పిటీషన్లను డిస్మిస్ చేసారు. ఈ ఇద్దరి పైనా అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ వేసిన పిటీషన్లను కొట్టి వేసారు. రేపు సుప్రీంలో అనర్హత పిటీషన్ల పైన విచారణ వేళ స్పీకర్ ఈ రోజు నిర్ణయం ప్రకటించారు. ఇప్పుడు స్పీకర్ వీరి అనర్హత పిటీషన్లు కొట్టి వేయటంతో… ఈ ఇద్దరికి బిగ్ రిలీఫ్ గానే భావించాలి. ఈ ఇద్దరూ పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని పేర్కొన్నట్లు సమాచారం. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్ వేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కారు గుర్తుతో పోటీచేసిన కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరడాన్ని ప్రశ్నిస్తూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్ అనర్హత పిటిషన్ ఫైల్ చేశారు. వీటిని విచారణ చేసిన స్పీకర్.. ఇప్పుడు ఈ ఇద్దరికీ రిలీఫ్ ఇస్తూ.. అనర్హత పిటీషన్లను డిస్మిస్ చేసారు.


