కరీంనగర్ నుండి కొండగట్టుకు కేంద్రమంత్రి అంజన్న ఆశీర్వాద యాత్ర

Date:


Telangana

oi-Dr Veena Srinivas

కరీంనగర్ నుండి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర చేయనున్నారు.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంజన్న ఆశీర్వాద యాత్రకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

కరీంనగర్‌ నుండి కొండగట్టుకు పాదయాత్ర

ఈ యాత్రలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ సహా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా పాల్గొననున్నారు. రేపు ఉదయం 7గంటలకు కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం వద్దకు పూజలు నిర్వహించి అనంతరం ఈ యాత్రను ప్రారంభిస్తారు. బీజేపీ తరఫున కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తాజాగా ఎన్నికైన 108 మంది సర్పంచులు, 450మంది వార్డు సభ్యులు, 54మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు.

బండి సంజయ్ తో కలిసి ఎన్నికల్లో గెలిచిన వారంతా పాదయాత్ర

వీరంతా కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేయనున్నారు. వీరు మాత్రమే కాకుండా వేలాది మంది కాషాయ కర్తలు, భక్తమండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్‌తో కలిసి కరీంనగర్ నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేసేందుకు సమాయత్తమవుతున్నారు. బీజేపీ పోలింగ్ బూత్ సభ్యుల నుండి రాష్ట్ర నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఎండల నేపధ్యంలో ఏర్పాట్లు

ఈ నేపథ్యంలో అంజన్న ఆశీర్వాద యాత్రకు వచ్చే వారిని స్వాగతిస్తూ భారీఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు నగరంలో పెద్దఎత్తున అలంకరణ పనులు చేపడుతున్నారు. ఎండాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రేపు కరీంనగర్‌లో 37నుంచి 40డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో పాదయాత్రలో పాల్గొనే వారికి ఇబ్బందులు తలెత్తకుండా దారి పొడవునా మంచినీళ్లు, మజ్జిగ వంటి పానీయాలను అందుబాటులో ఉంచేందుకు బీజేపీశ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

రేపు ఉదయం 7 గంటల నుండి అంజన్న ఆశీర్వాద యాత్ర

ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ యాత్రలో పాల్గొనేందుకు ఈ రోజు రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి అర్ధరాత్రి సమయానికి కరీంనగర్ చేరుకోనున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు మహాశక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 7 గంటలకు అధికారికంగా “అంజన్న ఆశీర్వాద యాత్ర” ప్రారంభం అవుతుంది.

కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచనలు

ఈ యాత్ర సందర్భంగా కరీంనగర్ నుండి కొండగట్టు వరకు గ్రామ గ్రామాన ప్రజలను పలకరించుకుంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పాదయాత్ర చేస్తారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 10వ తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా క్రమశిక్షణతో పాదయాత్ర నిర్వహించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కాషాయ శ్రేణులకు సూచించారు.

ఆధ్యాత్మిక భావన పెంపొందేలా పాదయాత్ర

పోలీసులకు సహకరించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక భావన పెంపొందించేలా ఈ యాత్ర కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related