Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కోతలు ఉంటాయని, రాష్ట్రంలో విద్యుత్ ప్రజలకు అందని ద్రాక్ష లాగా మారుతుందని, విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని బీఆర్ఎస్ పదేపదే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో విద్యుత్ సరఫరా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డును సృష్టించింది.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ చరిత్రలో మైలురాయి
తాజాగా తెలంగాణ విద్యుత్ సంస్థలు అసాధారణ రికార్డును నెలకొల్పడం చర్చనీయాంశంగా మారింది. మార్చి 13 2026 న చరిత్రలోనే అత్యధికంగా 341. 08 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ను విద్యుత్ సంస్థలు సరఫరా చేశాయి. అదే రోజు ఉదయం 11. 17నిమిషాలకు నమోదైన 18,228మెగావాట్ల గరిష్ట డిమాండ్ ను కూడా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ గ్రిడ్ విజయవంతంగా తట్టుకుంది. ఇది తెలంగాణ రాష్ట్ర విద్యుత్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.
డిమాండ్ కు తగ్గ సప్లై చేస్తున్న విద్యుత్ సంస్థలు
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వ్యవసాయ రంగంలో అధికంగా విద్యుత్ వినియోగం వెరసి రాష్ట్రంలో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ పెరిగింది. అయితే తెలంగాణ విద్యుత్ సంస్థలు, ప్రజల డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా విద్యుత్ వినియోగం పెరుగుతుంది అన్న అంచనాల నేపథ్యంలో, విద్యుత్ అవసరాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలు పూర్తిగా సిద్ధమవుతున్నాయి.
తెలంగాణా సర్కార్ కు ఉన్న సామర్ధ్యం ఇదే : భట్టి విక్రమార్క
ప్రతిరోజు 350 మిలియన్ యూనిట్లకు పైగా వినియోగం, సుమారు 19 వేల మెగావాట్ల గరిష్ట లోడ్ ను నిర్వహించే సామర్థ్యం తెలంగాణ రాష్ట్రానికి ఉండడం ఒక గొప్ప విషయంగా చెబుతున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ అధిక డిమాండ్ సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరాను కొనసాగించిన అన్ని విద్యుత్ సంస్థల సిబ్బందిని ఆయన ప్రశంసించారు.
ప్రజల అవసరాల మేరకే విద్యుత్ సరఫరా
భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో ప్రజల అవసరాల మేరకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని, అందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని ముందుకు సాగాలని ఆయన సూచించారు. గృహ, పారిశ్రామిక, వ్యాపార వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయవలసినటువంటి బాధ్యత విద్యుత్ సంస్థల పైన ఉందని ఆయన పేర్కొన్నారు.
కరెంట్ కోతల ఆరోపణలు చేసిన వారికి చెంపపెట్టు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలు ఉంటాయని ఆరోపణలు చేసిన వారికి చెంపపెట్టులా కరెంట్ అందించగలుగుతున్నాం అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతున్నారు. తెలంగాణ విద్యుత్ చరిత్రలోనే రికార్డు సృష్టించామని ఆయన వెల్లడించారు.


