News
oi-Suravarapu Dileep
సైబర్ భద్రతను మెరుగుపరచడం సహా ఆన్‌లైన్ నేరాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ బైండింగ్ ను తప్పనిసరి చేస్తూ టెలికాం విభాగం ఆదేశాలు జారీ చేసింది. 90 రోజుల్లోగా కొత్త నిబంధనను అమలు చేయాలని స్పష్టం చేసింది. సిమ్ బైండింగ్ అంటే.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి యాప్‌లను ఉపయోగించాలంటే.. అకౌంట్‌కు సంబంధించిన సిమ్ కార్డు కూడా ఫోన్‌లోనే ఉండాలి. లేకుంటే ఈ యాప్స్‌ను ఉపయోగించలేరు.
డిఫాల్ట్ గా ఉండాలి.. డిలీట్ చేసేందుకు అవకాశం ఉండకూడదు..!
ఈ నిబంధనను అమలు చేసేందుకు సంస్థలకు DoT (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్) 90 రోజుల్లోగా గడువు విధించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టెలికాం విభాగం తీసుకొచ్చిన యాప్‌ను అన్ని ఫోన్‌లలో డిఫాల్ట్‌గా ఉండేలా చూడాలని కోరింది. మరియు డిలీట్ చేసే అవకాశం లేకుండా చేయాలని సూచించింది. ఈ వివరాలు రాయిటర్స్ ద్వారా వెల్లడయ్యాయి.
సంచార్ సాథీ :
ప్రస్తుతం భారత్‌లో కోట్లాది మంది మొబైల్ యూజర్లు ఉన్నారు. రోజురోజుకు అధికమవుతున్న సైబర్ నేరాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేరాలను కట్టడి చేయడం సహా ప్రజలను అప్రమత్తం చేయడం, నేరాలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ వెబ్‌సైట్‌ను (Sanchar Saathi) అందుబాటులోకి వచ్చింది.
యాప్ కూడా :
అనంతరం ఈ సంవత్సరం జనవరి నెలలో సంచార్ సాథీ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై ఫిర్యాదు చేయవచ్చు. పోగొట్టుకున్న ఫోన్‌పై ఫిర్యాదు చేయవచ్చు. కొత్తగా కొనుగోలు చేసినా లేదా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఒరిజినల్ లేదా ఫేక్ అని తెలుసుకోవచ్చు.
ఏంటీ సంచార్ సాథీ యాప్ :
వీటితోపాటు మీ పేరుపై ఎన్ని మొబైల్ నంబర్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అనంతరం మీకు సంబంధం లేని నంబర్లపై డియాక్టివేట్ చేసేందుకు వీలుగా ఫిర్యాదు చేయవచ్చు. సంచార్ సాథీ ప్లాట్‌ఫాం ద్వారా ఇప్పటివరకు చోరీ అయిన 7 లక్షలకు పైగా మొబైల్స్‌ను ప్రభుత్వం గుర్తించింది.
కీలక నిబంధనలు :
ఈ సంచార్ సాథీ యాప్‌ను అన్ని ఫోన్‌లలో డిఫాల్ట్‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. త్వరలో లాంచ్ కానున్న ఫోన్‌లలో ఈ యాప్ ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా (Pre Installed) ఉండాలని, డిలీట్ చేసేందుకు అవకాశం ఉండకూడదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో :
ప్రస్తుతం ఉన్న ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా సంచార్ సాథీ యాప్ ఇన్‌స్టాల్ అయ్యేలా చూడాలని సంస్థలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ యాప్ ఇన్‌స్టాలేషన్ నిర్ణయం అమలు చేసేందుకు 90 రోజుల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డిఫాల్ట్ యాప్ ఇన్‌స్టలేషన్ పై స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలు ఎటువంటి స్పందన తెలియజేయలేదు.
సాధారణంగా ఈ తరహా యాప్‌లను డిఫాల్ట్‌గా తీసుకొచ్చేందుకు ఆపిల్ సంస్థ అంగీకరించదు. అయితే ఈ కొత్త నిబంధనపై ఆపిల్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సి ఉంది. కొత్త నిర్ణయంపై టెలికాం మంత్రిత్వ శాఖ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Best Mobiles in India
English summary
Government of india asks to smartphone manufacturers to preinstall sanchar saathi app
Story first published: Monday, December 1, 2025, 16:59 [IST]


