International
oi-Chandrasekhar Rao
ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకే ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. యుద్ధం 15వ రోజుకు చేరుకోగా దీనికి ముగింపు కనపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది అనేక దేశాల్లో వేలాది మంది ప్రయాణికులను చిక్కుకుపోయేలా చేస్తోంది.
ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది ఇరాన్‌లోనే కాగా, లెబనాన్, గల్ఫ్ దేశాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గల్ఫ్ ప్రాంతం యుద్ధ ముఖద్వారంలో నిలిచింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఈ పరిణామాల మధ్య ఇరాన్ అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీమ్ లీడర్ మోజ్తబా ఖమేనీతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కీలక నాయకుల గురించి సమాచారం అందించిన వారికి అమెరికా ఒక కోటి డాలర్ల బహుమతిని ప్రకటించింది. “రివార్డ్స్ ఫర్ జస్టిస్” కింద అమెరికా విదేశాంగ శాఖ ఈ పిలుపునిచ్చింది. దీనిపై ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఖమేనీ, ఇతర నేతలను ఇరాన్ ఉగ్రవాద నాయకులుగా అభివర్ణించింది ఇందులో.
మోజ్తబాతో పాటు ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ అసఘర్ హెయాజీ, మేజర్ జనరల్ యాహ్యా రహీమ్ సఫవి, హోమ్ మంత్రి బ్రిగేడియర్ జనరల్ ఎస్కాండర్ మోమెని, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజాని ఫొటోలు ఈ పోస్టర్లల్లో ఉన్నారు. విశ్వసనీయ సమాచారాన్ని అందించిన వారికి కోటి డాలర్ల బహుమతితో పాటు పునరావాసం కూడా కల్పిస్తామని అమెరికా తెలిపింది.
Got information on these Iranian terrorist leaders?
Send us a tip. It could make you eligible for a reward and relocation. pic.twitter.com/y7avkqdGWw
— Rewards for Justice (@RFJ_USA) March 13, 2026
వీరందరినీ కరడుగట్టిన టెర్రరిస్టులుగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తారని అమెరికా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ లేదా టోర్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తమను సంప్రదించవచ్చని విదేశాంగ శాఖ సూచించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఇరాన్ నాయకత్వం అజ్ఞాతంలోకి వెళ్లిందని అమెరికా పేర్కొన్న నేపథ్యంలో ఈ ప్రకటన అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.


