Telangana
oi-Korivi Jayakumar
క్షణికావేశంలో మనుషులు మృగాళ్ల లాగా మారిపోతూ చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసేస్తున్నారు. ఆవేశంలో విచక్షణ కోల్పోయి చేస్తున్న కొన్ని దారుణాలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఈ తరహా హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నపాటి కుటుంబ గొడవ చివరకు విషాదంగా మారి, ఓ గర్భిణి మహిళ ప్రాణాలు కోల్పోయింది. కడదాకా కలసి ప్రయాణం చేస్తామని.. ప్రమాణం చేసిన భర్త అనుమానంతో కట్టుకున్న ఆలిని దారుణంగా కడతేర్చాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..
స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి.. కోరుట్ల పట్టణానికి చెందిన హరిబాబును రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ దంపతులు వైష్ణవి తల్లిదండ్రుల ఇంట్లోనే నివసిస్తున్నారు. మొదట్లో సఖ్యంగా సాగిన వీరి జీవితం, కాలక్రమేణా చిన్నచిన్న గొడవలతో ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య తలెత్తిన వాగ్వాదం క్రమంగా తీవ్రరూపం దాల్చింది. మాటామాటా పెరిగి పెద్ద గొడవగా మారగా.. అదే సమయంలో ఆవేశానికి లోనైన హరిబాబు, మంగళవారం వేకువజామున భార్య వైష్ణవిపై కత్తితో దాడి చేశాడు.
దాంతో కత్తిపోట్లకు గురైన వైష్ణవి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే కుప్పకూలింది. స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ ఘటనతో షాక్‌కు గురయ్యారు. అయితే ఈ ఘటనలో మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే, వైష్ణవి ఐదు నెలల గర్భిణి అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకేసారి ఇద్దరి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.
ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు హరిబాబును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషాదంతో మాదాపూర్ గ్రామం దుఃఖంలో మునిగిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల జీవితం ఇలా ముగియడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. చిన్నపాటి గొడవలు ఎంతటి దారుణ పరిణామాలకు దారి తీస్తాయో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.


