గ్యాస్ ఏజెన్సీల వద్ద చెప్పుల క్యూ.. అర్దరాత్రి నుండి పడిగాపులు.. ఇదేం కష్టం నాయనా!

Date:


Telangana

oi-Dr Veena Srinivas

ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం కారణంగా ఏర్పడిన చమురు సంక్షోభంతో భారతదేశంలోని గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో గ్యాస్ వినియోగదారులు వంట గ్యాస్ కోసం నానా పాట్లు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ గ్యాస్ కోసం కష్టాలు తప్పడం లేదు. అయితే నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వంటగ్యాస్ కోసం వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి.

గ్యాస్ కోసం చెప్పుల క్యూ

భైంసా పట్టణంలోని కృపా గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు చెప్పులు క్యూలో పెట్టి అర్ధరాత్రి నుంచి పడిగాపులు పడుతున్నారు. రాత్రి 2 గంటల నుంచే బారులు తీరడం గ్యాస్ కొరత తీవ్రతను తెలియజేస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం ఇలా రాత్రివేళ నుంచే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొనడం స్థానికుల్లో ఆందోళనకు కారణమైంది. గత ఐదు రోజులుగా గ్యాస్ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా బుకింగ్ కావడం లేదని వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

గ్యాస్ బుకింగ్ పని చేయక ఏజెన్సీల వద్ద ప్రజల బారులు

ఆన్‌లైన్, ఫోన్ ద్వారా బుకింగ్ సక్రమంగా పనిచేయకపోవడంతో వారు నేరుగా ఏజెన్సీ వద్దకు చేరుకుని ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో ఏజెన్సీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. సకాలంలో గ్యాస్ సిలిండర్ రాక గృహిణులు వంట చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ వంట కార్యక్రమాలు సైతం అంతరాయం కలుగుతున్నాయని వారు చెబుతున్నారు.

అధికారులు హెచ్చరించినా ఏజెన్సీలలో మార్పు లేదు

కొందరు అత్యవసర పరిస్థితుల్లో అధిక ధరలకు బ్లాక్‌లో సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్లాక్ లో గ్యాస్ సిలిండర్ ధర మూడు వేల రూపాయలకు అమ్ముతున్నట్లు వారు చెబుతున్నారు. ఇదిలాఉంటే, గ్యాస్ సరఫరా వ్యవస్థలో లోపాలు, ఏజెన్సీల ప్రణాళికా లోపాలతో ఈ కొరత ఏర్పడుతోందని తెలుస్తోంది. అధికారులు సమస్యపై ఇప్పటికే ఏజెన్సీలకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, పరిస్థితిలో మార్పు కనిపించకపోవడం విమర్శలకు కారణంగా మారుతుంది.

పెరుగుతున్న గ్యాస్ ధరలతో మరింత ఆందోళన

వినియోగదారులకు సకాలంలో సరఫరా జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.మరోవైపు, గ్యాస్ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశంపై కూడా వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చుల మధ్య గ్యాస్ ధరలు పెరగడం సాధారణ ప్రజలపై మరింత భారం మోపుతుందని వారు భావిస్తున్నారు.

గ్యాస్ వినియోగదారుల సమస్య పరిష్కరించండి

ఈ క్రమంలోనే ముందుగానే గ్యాస్ కొనుగోలు చేసుకోవాలని ఆరాటపడుతున్న వారు లేకపోలేదు. ఇది కూడా ఒక రకంగా గ్యాస్ కొరతకు, ఏజెన్సీల మీద ఒత్తిడికి కారణం. తాజా పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే సరఫరా వ్యవస్థను మెరుగుపరచి, వినియోగదారుల కష్టాలను తొలగించాలని ప్రజలు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related