India
oi-Dr Veena Srinivas
దేశవ్యాప్తంగా ఇంధనం కొరత పైన ఆందోళన నెలకొంది. దీంతో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతాయని, గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందని ప్రజలలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. అందుకు తగ్గట్టుగా గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం, గ్యాస్ బుక్ చేసుకున్న కూడా సరైన సమయానికి గ్యాస్ రాకపోవడం, కేంద్రం గ్యాస్ బుకింగ్ గడువును పెంచడం అంటే అనేక కారణాలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.
కొత్త మోసాలకు తెరతీసిన సైబర్ నేరగాళ్ళు
ప్రజలలో ఉన్న ఈ ఆందోళనను అదునుగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి తెరతీశారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో నయా మోసాలకు తెర తీశారు సైబర్ నేరగాళ్లు. గ్యాస్ బుకింగ్ ఇబ్బందిని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు ఆన్లైన్లో బుకింగ్ చేసేవాళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తక్షణమే డెలివరీ చేస్తామంటూ పరిమిత అదనపు సిలిండర్లు ఇస్తామంటూ ఆకర్షణీయమైన ప్రకటనలతో నకిలీ వెబ్సైట్ లింకులను పంపిస్తున్నారు.
నకిలీ వెబ్సైట్ లింకులతో సైబర్ నేరం
hp, indane, bharat gas లోగోలతో కూడిన నకిలీ వెబ్సైట్ లింకులను పంపిస్తున్నారు. స్టాక్ అయిపోయింది వెంటనే ఈ లింకు ద్వారా ఒక రూపాయి చెల్లించి బుక్ చేసుకోండి అంటూ నమ్మించి, యూజర్లు రూపాయి చెల్లించడానికి ప్రయత్నించగానే వారి బ్యాంకు వివరాలు, యూపీఐ పిన్ లు మోసగాళ్లు దొంగిలించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
అధికారిక యాప్ లు, వెబ్సైట్లను మాత్రమే వాడాలి
దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు గ్యాస్ బుకింగ్ కోసం కేవలం అధికారిక యాప్ లు, వెబ్సైట్లను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. గుర్తుతెలియని లింకులను ఎట్టి పరిస్థితులలోను క్లిక్ చేయవద్దని అంటున్నారు. డబ్బులు పొందడానికి లేదా బుక్ చేయడానికి యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.ఎవరైనా పిన్ అడుగుతున్నారు అంటే అది మోసమేనని తేల్చి చెబుతున్నారు.
సైబర్ నేరానికి గురైతే ఇలా చెయ్యండి
అనధికారిక సైట్లలో ముందస్తు చెల్లింపులు చేయకండి అని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ దేశంలో గ్యాస్ ఏజెన్సీలు ఎప్పుడూ ఫోన్ ద్వారా డబ్బులు అడగరని, వ్యక్తిగత వివరాలను అడగరని, కనుక మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు అని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలని సూచిస్తున్నారు.
నేరానికి గురయ్యాక ఫిర్యాదు చెయ్యాల్సింది ఇప్పుడే
www.cybercrime.gov.in లో ఆన్‌లైన్ ఫిర్యాదు నమోదు చేయాలని చెబుతున్నారు. “గోల్డెన్ అవర్” మొదటి రెండు గంటల లోపు ఫిర్యాదు చేస్తే, డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలకు సూచనలు చేస్తున్నారు.


