Telangana
oi-Dr Veena Srinivas
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటల సర్వేను 45 రోజులలో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిని సర్వేను పూర్తి చేయడం కోసం విస్తృత ప్రణాళికలను రూపొందిస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు దృష్టి సారిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ డిజిటల్ పంట సర్వే పై కీలక నిర్ణయం
ఈ సర్వే ప్రక్రియలో నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించడానికి నిర్ణయించింది. ప్రైవేట్ సర్వేయర్లు, వాలంటీర్లను నియమిస్తూ గడువులోగా సర్వే పూర్తి చేసి కేంద్రానికి పంపించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు చక్కని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా అందించనుంది.
45 రోజుల్లోనే సర్వే పూర్తి చెయ్యాలి
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏఈవోలు మాత్రమే ఈ సర్వేను నిర్వహిస్తే మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. కానీ 45 రోజుల్లోనే సర్వేను పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఈ సర్వే కోసం పెద్ద సంఖ్యలో ప్రైవేటు సర్వేయర్లు, వాలంటీర్లను తీసుకుంటున్నారు. ఈ సర్వే ద్వారా వాలంటీర్లు రోజుకు 1000 రూపాయలు నుంచి 1500 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది.
సర్వేలో వారికి టార్గెట్, ఇన్కమ్ ఇలా
అయితే ఈ సర్వేలో నియమితులయ్యే వాలంటీర్లు, ప్రైవేట్ సర్వేయర్లు ఆయా గ్రామాలకు చెందిన వారే ఉండాలి. వీరికి రోజుకు 150 నుంచి 200 సర్వే నెంబర్ల పంట ఫోటోలు తీసే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ టార్గెట్ ను వీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా పూర్తి చేస్తే వారు రోజుకు వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఒక్కో పంట ఫోటోకు ఏడు రూపాయలు చొప్పున చెల్లింపులు చేస్తారు.
రాష్ట్రంలోని 10,621 గ్రామాలలో 1.94 కోట్లకు పైగా సర్వే నెంబర్లు
పది రోజుల్లో ఒక గ్రామంలోని పంటల వివరాలను పూర్తిగా ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంటుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని పదివేల 621 గ్రామాలలో 1.94 కోట్లకు పైగా సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇందులో 9,795 గ్రామాలలోని 1.74 కోట్ల సర్వే నెంబర్లకు సంబంధించిన పంట భూముల సర్వేను ప్రైవేట్ సర్వేయర్లు, వాలంటీర్లకు అప్పగిస్తారు. మిగిలిన 826 గ్రామాలలోని పోడు భూముల సర్వే బాధ్యత ఏఈఓలు నిర్వహిస్తారు.
డిజిటల్ పంట సర్వే కోసం రూ. 30.42కోట్లు
కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ పంటల సర్వే కోసం 30.42 కోట్ల రూపాయలను కేటాయించింది. కేంద్రం సర్వేను పూర్తి చేయడానికి డెడ్లైన్ విధించడంతో ఒక గ్రామంలో వాలంటీర్ ను తీసుకుని యుద్ధ ప్రాతిపదికన పని చేయించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇది బిఎస్సి అగ్రికల్చర్ డిప్లమా లేదా ఏదైనా సైన్స్ కోర్సు లేదా ఇంటర్, టెన్త్ ఇలా ఏదైనా పాసైన యువత, మొబైల్ యాప్ ను ఉపయోగించడంపైన అవగాహన ఉన్న యువతకు అవకాశం ఇస్తారు.


