Telangana
oi-Sai Chaitanya
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలతో సొంత పార్టీ సీనియర్లు ఇబ్బంది పడుతున్నారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ లో అనేక హోదాల్లో పని చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ వీడాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. మాజీ సీఎం కేసీఆర్ నుంచి తన భవిష్యత్ పై వచ్చిన హామీతో గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తాజా గా జీవన్ రెడ్డితో కమలం పార్టీ నేతలు టచ్ లోకి వచ్చారు. కీలక హామీ ఇచ్చినట్లు సమాచారం.
కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. కొంత కాలం గా ఆయన పార్టీలో ప్రాధాన్యత లేకపోవటం.. ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు తన నియోజక వర్గం లో పెత్తనం చేయటం పైన అసహనంతో ఉన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ జెండా మోసిన ఒక సీనియర్ నేత అయిన తాను ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేనని తేల్చి చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీన తన రాజీనామాను ప్రకటించేందుకు సిద్దమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. రాజకీయంగా సంజయ్ కుమార్‌తో పోరాడిన జీవన్ రెడ్డి, ఇప్పుడు అదే నాయకుడికి పార్టీలో పెద్దపీట వేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు నుంచి చైర్‌పర్సన్ ఎంపిక వరకు సంజయ్ కుమార్ మాటే చెల్లుబాటు కావడం, జీవన్ రెడ్డి వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టడంతో తనకు అవమానాలు ఎదురవుతున్న పార్టీలో తాను ఉండలేనని చెబుతున్నారు.
జీవన్ రెడ్డితో టచ్ లోకి బీజేపీ నేతలు
నియోజకవర్గంలో పదవుల విషయంలో.. పార్టీ కార్యక్రమాల్లో తనకు ఎలాంటి ప్రాధాన్యవేసవిత లేకపోవటం తో జీవన్ రెడ్డి నేరుగా కేసీఆర్ తో మాట్లాడినట్లు సమాచారం. ఆ తరువాత కేటీఆర్ తో పలు మార్లు చర్చలు జరిగాయని తెలుస్తోంది. బీఆర్ఎస్ లో చేరితే ఆయనకు సముచిత గౌరవం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి వంటి నేత పార్టీలోకి వస్తే ఉత్తర తెలంగాణలో తమ బలం పెరుగుతుందని బీఆర్ఎస్ భావించింది. ఇప్పటికే తన అనుచరులు, ఆత్మీయులతో భేటీ అయిన జీవన్ రెడ్డి వారి సూచన మేరకే తుది నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి, కాంగ్రెస్‌కు అధికారికంగా రాజీనామా చేసే అవకాశం ఉంది. జగిత్యాలలో తన బలాన్ని నిరూపించుకునేలా భారీ బలప్రదర్శనతో గులాబీ కండువా కప్పుకోవటం దాదాపు ఖాయమైన సమయంలో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. తమ పార్టీలోకి వస్తే ఇచ్చే ప్రాధాన్యత గురించి వివరించారు. బీజేపీలో కీలక స్థానంలో ఉన్న మాజీ మంత్రి నేరుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో, జీవన్ రెడ్డి ఇప్పుడు అటు బీఆర్ఎస్ – ఇటు బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్లతో ఎటు వైపు అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.


