India
oi-Dr Veena Srinivas
యూఎస్ ఇండియా డీల్ భారతదేశంలోని రైతులకు నష్టం చేస్తుందా? భారత్ అమెరికా ట్రేడ్ డీల్ లో భాగంగా యూఎస్ నుండి భారతదేశానికి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దానిపై సుంకాలు తొలగిస్తున్నారా? ఇదే గనుక జరిగితే ఇండియన్ మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా యుఎస్ వ్యవసాయ ఉత్పత్తులు వచ్చి పడతాయా? ఇది మన రైతులకు నష్టం చేస్తుందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
భారత్ యూఎస్ డీల్ .. రైతుల ఆందోళన
భారతదేశం, అమెరికా మధ్య కుదరనున్న వాణిజ్య ఒప్పందంపై రైతులలో ఆందోళన నెలకొంది. పలు రైతు సంఘాలు ఈ వాణిజ్య ఒప్పందం పైన తీవ్రంగా మండి పడుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా భారత వ్యవసాయ రంగం అమెరికా కార్పొరేట్ కంపెనీల వశమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా మోడీ సర్కార్ ను ఈ విషయంలో టార్గెట్ చేస్తున్నారు.
ఇబ్బడిముబ్బడిగా యూఎస్ ఉత్పత్తుల దిగుమతి
ఈ ఒప్పందం ప్రకారం మనం ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన సరుకులు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని అంటే భారతదేశం తన దిగుమతులను మూడు రెట్లు పెంచాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అమెరికా నుంచి ప్రతి సంవత్సరం 40 నుండి 42 బిలియన్ డాలర్ల దిగుమతి నుండి ఈ దిగుమతిని వంద బిలియన్ డాలర్లకు పెంచాల్సి ఉంటుందని వారు అంటున్నారు.
ఈ ఉత్పత్తుల విషయంలో ప్రధాన ఆందోళన
అదే జరిగితే యూఎస్ ఉత్పత్తులు ఇండియన్ మార్కెట్లో ప్రభావాన్ని చూపిస్తాయని, అది మన రైతాంగానికి నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాల్, పొగాకు, కొన్ని కూరగాయలు, మాంసం మొదలైన కీలకమైన వ్యవసాయ, పాల ఉత్పత్తులకు సుంకాలు తీసేస్తే తీవ్రంగా ప్రభావితం అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
భారత్ లోకి భారీగా రానున్న యూఎస్ ఉత్పత్తులు
అయితే అటువంటిదేమీ లేదని వీటి విషయంలో తాము అమెరికాకు తలుపులు బార్లా తెరవలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క్లారిటీ ఇస్తున్నారు. కానీ తాజా ట్రేడ్ డీల్ ప్రకారం గతంలో లేనివిధంగా అమెరికన్ ఉత్పత్తులు తొలిసారిగా భారత్ మార్కెట్లో ఒక స్థానాన్ని పొందే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త నిరసనలకు పిలుపు
భారత్ అమెరికా మధ్య వ్యవసాయ వాణిజ్యం విలువ ఎనిమిది బిలియన్ డాలర్లు. ఇక ఇదే క్రమంలో దీనిపైన సరైన క్లారిటీ లేక రైతులు తమకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.


