Andhra Pradesh
oi-Sai Chaitanya
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వారాంతపు సెలవులు కావటంతో తిరుమల దారులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సొంత వాహనాల్లో తరలి రావటంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఈ వారం వరుస సెలవులు ఉండటంతో భక్తుల రాక పెరిగింది. కాగా.. తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం అన్నప్రసాదం కోసం టీటీడీ భారీ లక్ష్యంగా కీలక చర్యలు ప్రారంభించింది.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనం కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ సర్కిల్ వరకు భక్తులు వేచి ఉన్నారు. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు నాణ్యమైన వంటకాలను అందించే లక్ష్యంతో భారీ వంటశాల నిర్మాణానికి టీటీడీ చర్యలు చేపట్టింది. రిలయన్స్ సంస్థ సహకారంతో రూ. 120 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధునాతన వంటశాల తో సహా డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రాన్ని ఆధునికీకరించడంతో పాటు విస్తరించడానికి చర్యలు చేపడుతోంది. అన్నప్రసాద కేంద్ర ఆధునీకరణ కోసం రిలయన్స్ సంస్థ రూ 120 కోట్లు విరాళం ప్రకటించింది. వెంగమాంబ భవనంలో అన్నంతో పాటు సాంబారు, రసం, వేపుడు, చట్నీ, చక్కెర పొంగలి చేసేలా 22 స్టౌలు, ఆవిరి యంత్రాలు ఏర్పాటు చేశారు.
రిలయన్స్ భారీ విరాళంతో ఆధునీకరణ
2011 నుంచి రెండు పూటల భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేస్తున్నటీటీడీ 2016 నుంచి అల్పాహార వితరణ ప్రారంభించింది. గోధుమరవ్వ, సేమియా ఉప్మా, రవ్వ పొంగలితో అల్పాహార వితరణ కొనసాగిస్తోంది.వెంగమాంబ అన్నదాన సత్రంలో ప్రసాదాన్ని స్వీకరించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రిలయన్స్ ఇచ్చిన విరాళంతో కొత్త పరికరాలు, వంట సామగ్రిని సమకూర్చు కోవాలని టీటీడీ అధికారులు భావించారు. ప్రస్తుతం ఉన్న 9 బాయిలర్ల స్థానంలో నూతనంగా గంటకు 3 టన్నుల అన్నం, సాంబారు తయారు చేసే బాయిలర్ల ఏర్పాటుకు టీటీడీ అధికారులు నిర్ణయించారు. రెండు నూతన అదనపు భవనాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ నెలలోనే తిరుమలలో మూడు ఆస్థానాలు నిర్వహించనున్నారు. ఉగాది వేళ నిర్వహించే ఆస్థానంతో పాటుగా నవమి ఆస్థానం నిర్వహించనున్నారు.


