Andhra Pradesh
oi-Chandrasekhar Rao
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 81,894 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,754 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.91 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 18 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది.
తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గృహస్తులకు అవసరమైన వివిధ సంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్దేశిత ఫీజు తో నిర్వహిస్తున్నారు. ఈ పురోహిత సంఘం ద్వారా వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ తదితర ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలను తక్కువ ఖర్చుతో చేసుకునేవిధంగా టీటీడీ అందుబాటులో ఉంచింది.
కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఫీజుల వివరాలివీ..
• వివాహం – ఉచితం
• ఉపనయనం – రూ.300
• సత్యనారాయణ వ్రతం – రూ.300
• కేశఖండన – రూ.200
• నామకరణం – రూ.200
• అన్నప్రాసన – రూ.200
• అక్షరాభ్యాసం – రూ.200
• వాహన పూజ – రూ.200
• చెవిపోగులు కుట్టడం – రూ.50
• చెవిపోగులు కుట్టడం (కాటేజ్‌లో) – రూ.100
• మేళం (ఒక సెట్టు) – రూ.100
• మేళం (రెండు సెట్లు) – రూ.300
• దస్త్ర పూజ – రూ.200
• ఇతర ధార్మిక కార్యక్రమాలు – రూ.200
భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. మరిన్ని వివరాల కోసం తిరుమల కళ్యాణ వేదిక వద్దనున్న పురోహిత సంఘాన్ని సంప్రదించాలని సూచించింది.


