Telangana
oi-Dr Veena Srinivas
మన రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని వంద నియోజకవర్గాలలో అధునాతన సౌకర్యాలతో పబ్లిక్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పాఠశాలలు అందుబాటులోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రతీ మండలంలో రెండు పబ్లిక్ స్కూల్స్
ప్రతి మండలంలోనూ కనీసం రెండు పబ్లిక్ స్కూల్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ లక్ష్యసాధనలో భాగంగా నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో విజయవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల తరహాలోని ఈ కొత్త పాఠశాలలను నిర్మించాలని సంకల్పించారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఒకటి చొప్పున పబ్లిక్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు.
తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభవార్త
ఇప్పటికే ఆరుట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైన తల్లిదండ్రుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తూ ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా అదే తరహాలో ప్రతి మండలంలోనూ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించడం రాష్ట్రంలోని తల్లిదండ్రులకు, విద్యార్థులకు శుభవార్త అని చెప్పాలి. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ సక్సెస్ రేటు సాధించడంతో. రాష్ట్రవ్యాప్తంగా అదే తరహాలో పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు.
ఆరుట్ల తెలంగాణా పబ్లిక్ స్కూల్ లో అన్ని వసతులు
ఈ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ లు, కంప్యూటర్ ల్యాబ్, విశాలమైన ఆటస్థలం వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాగుతోంది. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యాబోధన అందిస్తున్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంతో పాటు, సాయంత్రం స్నాక్స్ కూడా ఇస్తున్నారు. ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించారు.
తెలంగాణా పబ్లిక్ స్కూల్ సక్సెస్ తో అన్ని నియోజకవర్గాల్లో పబ్లిక్ స్కూల్స్
ఈ స్కూల్ సక్సెస్ కావడంతో పాఠశాల అడ్మిషన్లు 760 నుంచి 1600 కి పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లల్ని పాఠశాలకు పంపించడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి మెరుగైన విద్యను అందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


