Telangana
oi-Sai Chaitanya
కాంగ్రెస్ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో.. అభ్యర్ధుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో పార్టీ ఇద్దరు అభ్యర్ధులను దాదాపు ఖరారు చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తో చర్చల తరువాత ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే, బీఆర్ఎస్ పోటీకి దిగకుంటే కాంగ్రెస్ అభ్యర్ధులు ఇద్దరు ఏకగ్రీవంగా పెద్దల సభకు వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది.
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు జరగను న్నాయి. ప్రస్తుతం తెలంగాణ నుంచి పెద్దల సభలో సభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగియనుంది. వీరి స్థానంలో తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులు ఎంపిక కావాల్సి ఉంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో కాంగ్రెస్ రెండు స్థానాలు దక్కించుకోవటం సులభంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో.. రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధులను ఖరారు చేసింది. ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుత సభ్యులు అభిషేక్ సింఘ్వీ కి తిరిగి రెన్యువల్ కానుంది. సింఘ్వీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం న్యాయ వ్యవహారాల్లో కీలకం గా మారారు. అదే సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వానికి సన్నిహిత నేత కావటంతో ఆయనకు తిరిగి అవకాశం ఖాయంగా కనిపిస్తోంది.
సింఘ్వీ.. జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైపు హైకమాండ్ మొగ్గు
కాగా, రెండో స్థానం కోసం సుప్రీం మాజీ న్యాయమూర్తి… ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా ఇండియా కూటమి నుంచి పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి తరువాత ఆయన్ను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ తమ అభ్యర్ధులను పోటీకి దింపకుంటే.. ఈ ఇద్దరి ఎన్నిక లాంఛనంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పోటీకి దిగితే మార్చి 16న పోలింగ్, అదే రోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే.. సుదర్శన్ రెడ్డి ని బరిలోకి దింపితే పోటీ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి దేశంలోనే అత్యంత లబ్ద్ద ప్రతిష్టులైన ప్రగతిశీల న్యాయకోవిదునిగా కాంగ్రెస్ నాయకత్వం గతంలోనే అభివర్ణించింది. సుదర్శన్ రెడ్డికి సుదీర్ఘ, గొప్ప న్యాయపరమైన అనుభవం ఉందని, ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారని ఉప రాష్ట్రపతి ఎన్నిక సమయంలోనే ఖర్గే వివరించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం నిబద్ధతతో, ధైర్యంతో పోరాడుతున్నారని తెలిపారు. దీంతో.. ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. చివరి నిమిషంలో మార్పులు లేకుంటే సుదర్శన్ రెడ్డి, సింఘ్వీ తెలంగాణ నుంచి పెద్దల సభకు వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది.


