Telangana
oi-Chandrasekhar Rao
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.
ఈ పరిణామాలు భారత్ కు గుదిబండలా మారాయి. దేశంలో ఎల్పీజీ వంటగ్యాస్ సంక్షోభం ఏర్పడింది. డొమెస్టిక్, కమర్షియల్ అనే తేడా ఏదీ ఉండట్లేదు. అన్ని వర్గాల వారి మీదా దీని ప్రభావం పడింది. హోటళ్ల యజమానులు ఏకంగా సెలవులను ఇచ్చుకునే పరిస్థితి తలెత్తిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి తలెత్తింది. వంట వండటానికి ఇతర వనరులపై ఆధారపడాల్సి వస్తోంది.
ఈ సంక్షోభంలోనూ అవకాశాలను వెదుక్కుంటోన్నారు కేటుగాళ్లు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో వెతికే అమాయకులపై వల విసురుతున్నారు. కొత్త తరహా మోసాలకు తెరతీశారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు.
వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ వెబ్‌సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా, ఆన్‌లైన్‌లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే మెసేజీలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని, వీటిని ప్రజలు గుర్తించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని అన్నారు.
సిలిండర్ బుకింగ్, ఆన్‌లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని సజ్జనార్ చెప్పారు. నకిలీ వెబ్‌సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 కి కాల్ లేదా http://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సజ్జనార్ చెప్పారు.


