Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఉగాది కానుక అందించేందుకు సిద్దం అయింది. జాబ్ క్యాలెండర్ ప్రకటనకు తుది కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు పోస్టుల వారీగా ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు ఆర్దిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. ప్రభుత్వం ఈ మేరకు అధికారికంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. టీచర్ పోస్టులతో సహా దాదాపు పది వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.
ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల పైన తుది కసరత్తు చేస్తోంది. ఉగాది నాడు ముందుగా ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రకటన చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. ప్రభుత్వంలోని దాదాపు 60 విభాగాల్లో 10 వేల పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్‌ను కొత్త సంవత్సరాది రోజు ప్రకటించనుంది. ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రధాన శాఖల అధికారుల తో తాజాగా ఆర్దిక శాఖ కీలక సమావేశం నిర్వహించి.. వారి నుంచి ఖాళీల వివరాలు సేకరించింది. కొన్ని పోస్టులకు ఇప్పటికే ఆమోదం లభించగా, మరికొన్ని ఆ శాఖ పరిశీలనలో ఉన్నాయి. రెండు, మూడు రోజుల్లో మొత్తం ఎన్ని పోస్టులు జాబ్ క్యాలెండర్‌లో ఉంటాయనే దానిపై స్పష్టత వస్తుంది. ఇప్పటివరకూ ఆర్థిక శాఖ ఆమోదం లభించిన పోస్టుల్లో 470 గ్రూప్-2 పోస్టులు, 101 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రభుత్వం గత ఏడాది మెగా డీఎస్సీ నిర్వహించి 16వేల పోస్టులు ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ ఏడాది మరో మూడు వేలకుపైగా పోస్టుల భర్తీని జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించనుంది.
శాఖల వారీగా ఖాళీలు … డీఎస్సీ సైతం ప్రకటన
యూనివర్సిటీల్లో సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల్లో తొలుత 1,500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీల్లో మూడు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలు న్యాయ వివాదాలతో చాలాకాలం నుంచి ఈ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. గత ప్రభుత్వంలో భర్తీకి హడావిడిగా ప్రక్రియ ప్రారంభించినా, రోస్టర్ తప్పులతో మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో న్యాయ వివాదాలు పరిష్కరించి తొలుత 1,500 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిని జాబ్ క్యాలెండర్ లో పొందు పరిచే అవకాశం ఉంది. ఇక.. జీఏడీ తో సహా ఇతర శాఖల్లో గ్రూప్-2 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా, గత ప్రభుత్వంలో జారీ చేసిన గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలను ఏపీపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది. 87 గ్రూప్-1, 891 గ్రూప్-2 పోస్టులను భర్తీ చేసింది. కాగా ఈ నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టులను క్యారీ ఫార్వార్డ్ కింద జాబ్ క్యాలెండర్‌లో ప్రకటిస్తుంది. అలాగే వివిధ శాఖల్లో భర్తీ చేపట్టదలచిన పోస్టులను క్యాలెండర్‌లో చూపించనుంది. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా వెయ్యి పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటుగా డిప్యూటీ కలెక్టర్లు 11, డీఎస్పీ సివిల్ 10, డీఎస్పీ జైళ్లు 4, ఆర్టీవో 3, డీఎల్‌వో 35, కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్ 17, ఏఏవో 3, సీటీవో 10, డీఈవో 2, డీఎస్ డబ్ల్యూవో 4, డీటీడబ్ల్యూవో 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం వివరాలను జాబ్ క్యాలెండర్ లో వెల్లడించనున్నారు.


