Andhra Pradesh
oi-Chandrasekhar Rao
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్ హనుమాన్ ను ప్రారంభించింది. ఏపీలో ఈ తరహా ప్రాజెక్ట్ అమలులోకి రావడం ఇదే ప్రథమం. కొద్దిసేపటి కిందటే పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రసంగించారు.
మానవ- వన్యప్రాణి సంఘర్షణను నివారించడం కోసం ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు. దీన్ని సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ పథకంగా అభివర్ణించారు. చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కడైతే ఏనుగులు, ఇతర వన్యప్రాణులు గ్రామాల్లోకి ప్రవేవించి ప్రజల ప్రాణాలకు, వ్యవసాయానికి ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఉన్నాయని, అలాంటి చోట్ల వీటిని ఎలా అదుపు చేయాలనే ఆలోచన నుంచే ఇది పుట్టిందని పేర్కొన్నారు.
ఒకవంక వన్యప్రాణులను సంరక్షిస్తూనే మరోవంక వాటి బారి నుండి ప్రజల ప్రాణాలు, పంటలు, పశువులు, ఆస్తులను పరిరక్షించడమే ఈ హనుమాన్ ప్రాజెక్ట్ ప్రధాన కర్తవ్యమని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే స్పందించడం, కావాల్సిన ఉపశమన చర్యలు తీసుకోవడం, పరిహారం చెల్లింపుల కోసం ఇప్పటివరకు ఇటువంటి ఒక వ్యవస్థ అనేది లేదని, ఈ హనుమాన్ ప్రాజెక్ట్ తో ఈ కొరత తీరిందని అన్నారు.
దీనికోసం గ్రామీణ స్థాయంలో పంచాయితీరాజ్, వ్యవసాయ, ఉద్యాన వనాలు, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర విభాగాతో సమన్వయం చేసుకుంటామని, ఈ ప్రాజెక్ట్ ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి జీపీఎస్ ట్రాకింగ్ వంటి పూర్తి సాంకేతికతతో కూడిన 100 వాహనాలను ప్రారంభించామని గుర్తుచేశారు. ఇందులో 93 రాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, వైల్డ్ లైఫ్ అంబులెన్సు ఏడు ఉన్నాయని తెలిపారు.
వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతిలో నాలుగు వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ ట్రీట్మెంట్ సెంటర్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని పవన్ వివరించారు. వన్యజీవి రక్షక్ అనే వాలంటనీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతున్నామని, వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తున్నామని చెప్పారు. గ్రామస్థాయిలో పాములు, ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. వాలంటీర్లుగా స్థానిక యువతకు అవకాశాలు ఇస్తామని పవన్ స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచామని, అంతకు ముందు అయిదు లక్షల రూపాయలు ఉంటే తాము వచ్చాకా దీన్ని 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. గాయపడినవారికి పరిహారం మొత్తాన్ని రెండు లక్షలు నిర్ణియించామని తెలిపారు. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తున్నామని అన్నారు.
చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను తీసుకొచ్చామని అన్నారు. ఇప్పటివరకు ఎనిమిది ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి ఏనుగుల నుండి ప్రజలకు, పంటలకు రక్షణ కల్పించామని ఆయన వివరించారు.


