International
-Bomma Shivakumar
పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ.. తన అధికారిక ప్రకటనలో అక్షర దోషాలతో నెట్టింట నవ్వుల పాలైంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వాషింగ్టన్ లో ‘బోర్డ్ ఆఫ్ పీస్’ సమావేశానికి హాజరైన ప్రధాని దేశానికి అంతర్జాతీయ ఇబ్బందిని తెచ్చిపెట్టారు.
‘బోర్డ్ ఆఫ్ పీస్’ ప్రారంభ సమావేశానికి (ఫిబ్రవరి 18-20) ప్రధాని షరీఫ్ అమెరికా పర్యటన కోసం ఈ ప్రకటన విడుదలైంది. అందులో టైటిల్ “Prime Minister’s Visit to the Unites States of Americas” అని ఉంది.. ‘యునైటెడ్’, ‘అమెరికా’ బదులు ‘యునైట్స్’, ‘అమెరికాస్’ అని తప్పులున్నాయి.
ఈ పొరపాట్లను నెటిజన్లు గుర్తించి, పాకిస్థాన్ సోషల్ మీడియా పొరపాట్లపై వ్యంగ్యంగా స్పందించారు. ‘పాకిస్థాన్ (సివిలియన్స్)’ ఎక్స్ ఖాతా “లనాత్ హా తమ్ పర్” అని పోస్టు చేసింది. మరో యూజర్ సౌరవ్ “తోడా జ్యదా కర్టెన్ రైస్ హో గయా బ్రో. యునైట్స్” అన్నారు. మరొక ఎక్స్ ప్రొఫైల్ “సెంటర్ ఆఫ్ గ్రావిటీ” అని వ్యాఖ్యానించింది.
పాకిస్థాన్ కు ఇలాంటి పొరపాట్లు కొత్తేమీ కావు. గత సంవత్సరం కూడా ఇజ్రాయెల్ దాడులపై షెహబాజ్ షరీఫ్ “ఐ కండెం ద ఎటాక్” కు బదులు “ఐ కండోమ్ ద ఎటాక్” అని తప్పుగా రాసినట్లు ఓ స్క్రీన్ షాట్ ఆన్ లైన్లో వైరల్ అయింది.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ‘బోర్డ్ ఆఫ్ పీస్’ తొలి సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఇది ఆయన అధికారిక అమెరికా పర్యటన. షరీఫ్‌తో పాటు ఉప ప్రధాని ఇషాక్ దార్, ఆర్థిక మంత్రి ఔరంగజేబ్, సమాచార మంత్రి అత్తావుల్లా తారార్, ప్రధాని ప్రత్యేక సహాయకుడు తారిఖ్ ఫాతెమీ ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.
షరీఫ్ శుక్రవారం వాషింగ్టన్లో ‘బోర్డ్ ఆఫ్ పీస్’ సెషన్లో పాల్గొని, సీనియర్ అమెరికా అధికారులతో చర్చిస్తారు. ప్రధాని కార్యాలయం ప్రకారం, ఆయన అమెరికా నాయకత్వంతో పాటు ఇతర దేశాల ప్రతినిధులతో సమావేశమవుతారు. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, పాకిస్థాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి 8 ముస్లిం మెజారిటీ దేశాలు ఈ సమావేశంలో పాల్గొంటాయని అంచనా.


