Business
oi-Chandrasekhar Rao
అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏదీ మినహాయింపు కాదు. ఆయా దేశాల్లోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్లు, రాయబార కార్యాలయాలను ఇరాన్ వదిలిపెట్టట్లేదు. వాటన్నింటిపైనా మిస్సైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో శక్తిమంతమైన బాంబులను జారవిడుస్తోంది.
ఈ పరిణామాలు భారత్ కు గుదిబండగా మారాయి. ఇప్పటికే గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను భారీగా పెంచాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఒక్కో సిలిండర్ పై 60 రూపాయలు పెరిగింది. ఈ రేట్లు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి కూడా. ఇటీవలే కమర్షియల్ వంటగ్యాస్ రేట్లను కూడా పెంచిన విషయం తెలిసిందే.
దీంతో ఇక అందరి దృష్టి కూడా పెట్రోల్ రేట్లపై పడ్డాయి. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చనే ఊహాగానాలకు తెర లేచింది. పశ్చిమ ఆసియాలో ఘర్షణలు తీవ్రతరం కావడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గణనీయంగా పెరగడం దీనికి మరింత బలాన్ని ఇచ్చినట్టయింది. సరఫరా అంతరాయాల భయాల మధ్య, బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ బ్యారెల్కు అయిదు శాతానికి పైగా పెరిగింది. బ్యారెల్ ఒక్కటింకి 90.25 డాలర్లకు చేరింది. 2024 ఏప్రిల్ తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.
యూఎస్ బెంచ్మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో సైతం క్రూడ్ ధర జంప్ అయింది. ఏకంగా 8.1 శాతం పెరిగి 87.56కు చేరింది. ఇది రికార్డు స్థాయి ధర. ఈ మధ్యకాలంలో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో ఈ స్థాయిలో ధరల పెరుగుదల చోటు చేసుకోలేదు. ఇది- దేశీయ పెట్రో రేట్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే డొమెస్టిక్ వంటగ్యాస్ రేట్లు పెరిగిన నేపథ్యంలో త్వరలో వీటి రేట్లను కూడా కేంద్రం సవరిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి.
కాగా- ఈ నేపథ్యంలో పలు చోట్ల పెట్రోల్ బంకుల్లో వాహనదారుల రద్దీ నెలకొంది. ఎల్పీజీ రేట్లు పెరగబోతోన్నాయంటూ శుక్రవారం నాడే వార్తలు రావడంతో ఇంధన ధరలు కూడా హైక్ కావొచ్చని భావించారు. రాత్రివేళ పెట్రోల్ బంకుల ముందు బారులు తీరి నిల్చున్నారు. ఈ తెల్లవారుజామున కూడా అనేక చోట్ల పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల తాకిడీ కనిపించింది.


