ఫలించిన కవిత పోరాటం.. దిగొచ్చిన రేవంత్ సర్కార్!

Date:


Telangana

oi-Jakki Mahesh

ఖమ్మం శివారులో వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వెలుగుమట్లలో కొందరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. అవి ప్రభుత్వ భూములు అని చెబుతూ 10 రోజుల క్రితం రెవెన్యూ అధికారులు నేలమట్టం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో వందలాది కుటుంబాలు నిరాశ్రయులుగా మారిపోయాయి. ఈ క్రమంలో తమ భూములను కాపాడాలని కోరుతూ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వెనకడుగు వేసేది లేదని ఆమె చేపట్టిన దీక్షకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.

కవిత దీక్షతో కదిలిన యంత్రాంగం
కవిత దీక్ష అని ప్రకటించగానే అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ హమీ మేరకు ఇళ్లు కూల్చిన చోటే బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. వెలుగుమట్లలో ఇళ్లు నేలమట్టం చేసిన చోటే చదును చేసే పనులను ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. రెవెన్యూ అధికారులు చేసిన సామాజిక, ఆర్థిక సర్వే ఆధారంగా అర్హులైన బాధితులను గుర్తించగా.. వారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను బుధవారం(మార్చి 11) ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్ లో నేడు(బుధవారం) పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పట్టాలను తమ చేతుల మీదుగా అందజేయనున్నారు.

వెలుగుమట్లలో అసలేం జరిగిందంటే?
ఖమ్మం సమీపంలోని వెలుగుమట్లలో భూదాన్ భూమిలో మొత్తం 742 కుటుంబాలకు చెందిన నివాసాలను ఫిబ్రవరి 24న అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భూదాన్ భూమిని ఆక్రమించారని వాటిని తొలగించినట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించగా.. వారు అంబేడ్కర్, టీటీడీసీ భవనాల్లోనే తాత్కాలికంగా తలదాచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళనకు దిగడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల్లో అర్హులను గుర్తించడానికి అధికారులు పలు ఆధారాల ప్రకారం చిరునామాలను సేకరించి.. వారిలో మొత్తం 412 కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. వారికి నేడు పట్టాలు పంపిణీ చేయనున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related