International
-Lingareddy Gajjala
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన క్షణంలోనే పాకిస్థాన్‌కు ఒక చేదు నిజం అర్థమైంది. ట్రంప్‌ను పొగిడినా, దగ్గరయ్యేందుకు ఎంత ప్రయత్నించినా… చివరికి దానికి ఎలాంటి ఫలితం లేదన్న విషయం బహిర్గతమైంది. అప్పటికే 19 శాతం సుంకంతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్‌కు ఈ నిర్ణయం గట్టిదెబ్బగా మారింది.
ఈ వారం దక్షిణాసియా సోషల్ మీడియాను ఓసారి గమనిస్తే చాలు. సుంకాల పట్టికలు చూడకుండానే ఏం జరిగిందో అర్థమైపోయింది. పాకిస్థాన్‌లో మీమ్స్ వెల్లువెత్తాయి, వ్యంగ్య వ్యాఖ్యలు పెరిగాయి, కొందరు తమ మీదే జోకులు వేసుకున్నారు. ఇది ఒక వాణిజ్య ఒప్పందంపై స్పందన కాదు. కఠినమైన భౌగోళిక రాజకీయ వాస్తవం ముందు వచ్చిన షాక్‌కు స్పందన. ట్రంప్ భారత్.. అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించినప్పుడు, ఆ వార్త పాకిస్థాన్‌లో నిశ్శబ్దంగా ఉన్న గదిలో ప్లేటు కింద పడిన శబ్దంలా అనిపించింది. వివరాలు పూర్తిగా బయటకు రాకపోయినా, సందేశం మాత్రం క్లియర్-భారత్‌కు ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు నిర్లక్ష్యం.
Pakistan కు అర్థమయ్యే క్షణం ఇది..
ఈ ఘట్టం అసలు భారత్ గురించీ, అమెరికా గురించీ కాదు. పాకిస్థాన్ తనను తాను ఎక్కడ ఉందని భావించుకుందో, వాస్తవానికి ఎక్కడ ఉందో అర్థమయ్యే క్షణం ఇది. ఇస్లామాబాద్‌లో నెలల తరబడి ఉన్న నమ్మకం ట్రంప్‌తో సంబంధాలు బలపడ్డాయని, మళ్లీ వాషింగ్టన్‌కు పాకిస్థాన్ కీలక భాగస్వామి అయిందని.
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పాకిస్థాన్ ఏం చేయలేదంటే అది లేదు. ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తేశారు. నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. అతని ‘బోర్డ్ ఆఫ్ పీస్’లో చేరారు. ఖనిజాల సహకారం నుంచి రాజకీయ మద్దతు వరకూ అన్నీ ఇచ్చారు. “మేమున్నాం” అని సంకేతాలిచ్చారు. కానీ ఫలితం? ప్రతిదీ చేసి కూడా పాకిస్థాన్‌కు అధిక సుంకాలే. అదే సమయంలో ట్రంప్‌ను బహిరంగంగా మెప్పించని భారత్‌కు తక్కువ సుంకాలు.
అసలు ట్విస్ట్..
ఇక్కడే అసలు ట్విస్ట్. భారతదేశం ట్రంప్‌పై కోపంగా లేదూ, భయపడలేదూ. అది కావాలనే దూరాన్ని ఎంచుకుంది. ఇదే చాలామంది పాకిస్థాన్ విశ్లేషకులు అర్థం చేసుకోలేకపోయిన విషయం. ట్రంప్‌తో బహిరంగంగా సన్నిహితంగా లేకపోవడాన్ని వారు వ్యూహాత్మక లోపంగా భావించారు. కానీ అది స్పష్టమైన వ్యూహం.
గతేడాది సుంకాల విషయంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు కూడా భారత్ తొందరపడలేదు. ఒక దశలో ట్రంప్ పదే పదే కాల్ చేసినా ప్రధాని మోడీ స్పందించలేదని జర్మన్ మీడియా రాసింది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో అరుదైన సంఘటన. అయినా భారత్ తన లైన్ మార్చలేదు. తర్వాత అమెరికా వర్గాలు “ప్రాప్యత లేదు కాబట్టే ఒప్పందం ఆలస్యమైంది” అని చెప్పేందుకు ప్రయత్నించాయి. కానీ భారత్ స్పష్టంగా ఖండించింది. మోడీ-ట్రంప్ మధ్య పలుమార్లు చర్చలు జరిగాయని, సమస్య కమ్యూనికేషన్ కాదని, ప్రక్రియ అని తేల్చి చెప్పింది.
ఫోన్ కాల్స్‌తో కాదు, విధానాలతో..
అంటే భారతదేశం చెప్పింది ఒక్కటే.. వాణిజ్య ఒప్పందాలు ఫోన్ కాల్స్‌తో కాదు, విధానాలతో కుదురుతాయి. ఈ నేపథ్యాన్ని చూసుకుంటే, ట్రంప్ తాజా ప్రకటన పాకిస్థాన్‌ను ఎందుకు అంతగా కుదిపేసిందో అర్థమవుతుంది. భారత్ ట్రంప్‌ను మెప్పించి గెలవలేదు. అతన్ని మెప్పించకుండానే గెలిచింది. ట్రంప్ ప్రకటన ప్రకారం భారతీయ ఉత్పత్తులపై సుంకం 18 శాతానికి తగ్గింది. రష్యా చమురు కొనుగోలుపై విధించిన అదనపు శిక్షాత్మక సుంకాలు కూడా తొలగించారు. ప్రతిగా భారత్ భారీగా అమెరికా ఉత్పత్తులు కొనుగోలు చేస్తుందని ట్రంప్ చెప్పాడు. భారత్ అధికారికంగా అన్ని వివరాలు ఇంకా ధృవీకరించలేదు. కానీ దిశ మాత్రం స్పష్టంగా ఉంది.
ఒకే ఏడాదిలో ఐదు ఒప్పందాలు..
అదే సమయంలో భారత్ యూరోపియన్ యూనియన్‌తో, యూకేతో కీలక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒమన్, న్యూజిలాండ్, ఇప్పుడు అమెరికా..ఒకే ఏడాదిలో ఐదు ఒప్పందాలు. ఇది భారతదేశపు వేగవంతమైన వాణిజ్య దౌత్యం. ఇవి తొందరపాటు ఒప్పందాలు కాదు. ఎవరికో నచ్చేందుకు చేసిన రాయితీలు కాదు. ఎదురు చూడటం, ఎంపికలు పెంచుకోవడం, ఒకే దేశంపై ఆధారపడకుండా ముందుకు వెళ్లడం..ఇదే భారత వ్యూహం.
భారతదేశం ట్రంప్‌కు స్పందించడం లేదు. అతని చుట్టూ తిరుగుతూ తన దారి తాను వేసుకుంటోంది. పాకిస్థాన్‌కు ఇది ఒక దౌత్య పరాజయం కన్నా, ముఖం ముందుకు పెట్టిన అద్దంలా అనిపించింది. ఈ కథ భారత్ గెలిచిందన్నదానికంటే, పాకిస్థాన్ ఒక విషయం గ్రహించాల్సిన క్షణం. పొగడ్తలు, దగ్గరదనం, విధేయత..ఇవి మాత్రమే శక్తిని ఇవ్వవు.


