India
oi-Lingareddy Gajjala
ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బీజాపూర్ అటవీ ప్రాంతం గురువారం ఉదయం ఒక్కసారిగా యుద్ధభూమిలా మారింది. భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో పేరుగాంచిన నక్సలైట్ కమాండర్ హతమయ్యాడు. అతడి వద్ద నుంచి ఏకే-47 రైఫిల్ స్వాధీనం కావడంతో ఈ ఆపరేషన్ ప్రాధాన్యం మరింత పెరిగింది.
చిన్నాజెల్లూరు – తారెం అటవీ మార్గాల్లో ఉదయం 7.30 గంటల సమయంలో మొదలైన కాల్పులు కాసేపట్లోనే ఉగ్రంగా మారాయి. సాయుధ మావోయిస్టుల కదలికలపై ముందుగా అందిన ఖచ్చితమైన నిఘా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), కోబ్రా కమాండోలు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. కొన్ని గంటల గాలింపుని వెంటనే ఈ భీకర ఘర్షణ చోటుచేసుకుంది.
Maoist కమాండర్ ఉదమ్ సింగ్గా మృతి..
ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టును కమాండర్ ఉదమ్ సింగ్గా ప్రాథమికంగా గుర్తించారు. అతను ప్లాటూన్ నంబర్ -30కు చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు (DVCM) గా పనిచేస్తూ, దక్షిణ బస్తర్ ప్రాంతంలో అత్యంత చురుకైన, ప్రమాదకర ఆపరేటివ్‌లలో ఒకడిగా పేరొందిన వ్యక్తిగా భద్రతా వర్గాలు చెబుతున్నాయి. అతడి పూర్తి పాత్ర, పాల్గొన్న హింసాత్మక ఘటనలపై గాలింపు పూర్తైన తర్వాతే అధికారిక వివరాలు వెల్లడిస్తాం అని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, దట్టమైన అటవీ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి అడపాదడపా కాల్పుల శబ్దాలు వినిపిస్తుండటంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మరికొంతమంది మావోయిస్టులు దాగి ఉండొచ్చన్న అనుమానంతో అదనపు బలగాలను రంగంలోకి దింపి, పేలుడు పదార్థాలు, మావోయిస్టు ఆశ్రయ కేంద్రాల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు.
దక్షిణ బీజాపూర్‌లో జరుగుతున్న ఈ ఆపరేషన్ మావోయిస్టులపై భద్రతా బలగాల దాడుల్లో కీలక మలుపుగా మారుతుందా? లేదా మరో పెద్ద ఎదురుకాల్పులకు ఇది సంకేతమా? అన్న ఉత్కంఠతో ప్రస్తుతం మొత్తం ప్రాంతం ఉలిక్కిపడుతోంది.


