International
oi-Chandrasekhar Rao
ఇరాన్- ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. ఏకంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్ పై మిస్సైళ్లు, డ్రోన్ బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్ లో వరుస పేలుళ్లు సంభవిస్తోన్నాయి. దట్టమైన పొగలు ఆ నగరాన్ని ఆవరించింది. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ పరిణామాలపై భారత్ అలర్ట్ అయింది. ఇరాన్, ఇజ్రాయెల్ లల్లో నివసించే పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది. అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అనవసర ప్రయాణాలను మానుకోవడం లేదా వాయిదా వేసకోవాలని కోరింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇరాన్, ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేశాయి. ఇక్కడ భారతీయులందరూ రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని పేర్కొంది.
ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ వల్ల తలెత్తుతున్న తక్షణ ముప్పును నిర్మూలించాలనేదే ముఖ్య ఉద్దేశమని అన్నారు. తద్వారా అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను రక్షించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అమెరికా సైన్యం ఇరాన్‌లో పెద్ద ఎత్తున యుద్ధ కార్యకలాపాలను ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండకూడదని ఆయన తేల్చి చెప్పారు. అక్కడి క్షిపణులు, నౌకాదళాన్ని పూర్తిగా నాశనం చేస్తామని హెచ్చరించారు.
ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని, ఇది అమెరికా సైనిక శక్తిని సవాలు చేయకూడదని ఆయన చెప్పారు. ఇరాన్ క్షిపణులన్నింటినీ ధ్వంసం చేస్తామని, రక్షణ వ్యవస్థను నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు ఇది పూర్తిగా ధ్వంసమై తీరుతుందని అన్నారు. ఇది ఇక్కడితో ఆగదని, ఇరాన్ నౌకాదళాన్ని అంతం చేస్తామని ట్రంప్ అన్నారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ తమ ఆయుధాలను విడిచిపెట్టితే పూర్తి స్వేచ్ఛను ఇస్తామని, లేదంటే అంతాన్ని ఎదుర్కొంటారని స్పష్టం చేశారు.
ఇరాన్ అణు కార్యక్రమంపై ఒప్పందానికి ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా ప్రాంతంలో భారీ సంఖ్యలో యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను మోహరించింది. దేశవ్యాప్తంగా నిరసనల తర్వాత ఇరాన్ దేశీయంగా సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో ట్రంప్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ఇరాన్ యుద్ధాన్ని నివారించాలని ఆశించినప్పటికీ, యురేనియం సుసంపన్నం చేసుకునే తమ హక్కును సమర్థించుకుంటుంది.


