International
oi-Jakki Mahesh
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ మరోసారి రక్తసిక్తమైంది. ఇస్లామాబాద్ నగరంలోని షెహజాద్ టౌన్ పరిధిలో ఉన్న తెర్లాయ్ ఇమామ్‌బారా (షియా ముస్లింల ప్రార్థనా స్థలం) వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఓ ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఈ భయంకరమైన దాడిలో దాదాపు 69 మంది మృతి చెందగా.. దాదాపు 169 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ప్రధాన ద్వారం వద్దే పేలుడు
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో నమాజ్ చేసేందుకు జనాభా అధికంగా ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దుండగుడు ఇమామ్‌బారా ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని తన వద్ద ఉన్న పేలుడు పదార్థాలను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో69 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) నగరవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. పోలీసులు, భద్రతా దళాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. గాయపడిన వారిని వెంటనే పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS), పాలిక్లినిక్ ఆసుపత్రులకు తరలించారు. భారీగా ప్రాణనష్టం జరిగి ఉండవచ్చనే అనుమానంతో రెస్క్యూ టీమ్‌లు శిథిలాల వద్ద గాలింపు చర్యలు చేపట్టాయి.
భద్రతా సిబ్బంది అడ్డుకున్నా తప్పని విలయం
శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో భక్తులు అధికంగా ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి బాంబర్ ప్రధాన ప్రార్థనా మందిరంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా, అక్కడి గేటు వద్ద ఉన్న అప్రమత్తమైన గార్డులు అతడిని అడ్డుకున్నారు. లోపలికి వెళ్లడం సాధ్యం కాకపోవడంతో, నిందితుడు ప్రధాన ద్వారం వద్దే తనను తాను పేల్చుకున్నాడు. ఒకవేళ అతడు మందిరం లోపలికి వెళ్లి ఉంటే మృతుల సంఖ్య వందల్లో ఉండేదని భద్రతా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
రక్తసిక్తమైన వీధులు.. భీకర దృశ్యాలు
ఈ పేలుడు ధాటికి ఇమామ్‌బారా ప్రధాన ద్వారం పూర్తిగా ధ్వంసమైంది. చుట్టుపక్కల భవనాల కిటికీలు పగిలిపోయాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఘటనా స్థలం అత్యంత భయానకంగా కనిపిస్తోంది. రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు, రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలు అక్కడి బీభత్సాన్ని కళ్లకు కడుతున్నాయి.
స్పందించిన పాక్ ప్రధాని.. మూడు నెలల్లోనే రెండో అతిపెద్ద దాడి
పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతేడాది నవంబర్ 11, 2025న కూడా నగరంలోని జిల్లా సెషన్స్ కోర్టు భవనం వెలుపల ఆత్మహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఘటన మరవక ముందే మరోసారి రాజధాని నగరంలో ఇలాంటి ఆత్మాహుతి దాడి జరగడం అక్కడి భద్రతా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రాజధాని నగరంలోనే పదే పదే ఇలాంటి దాడులు జరగడం పట్ల స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Tragic reports from Tarlai, Islamabad
A suicide bomber detonated at the gate of an Imambargah, with multiple casualties and many injured.
Targeting Shia worshippers is not politics, it’s sectarian terrorism.
Pakistan’s biggest internal crisis isn’t image or diplomacy; it’s the… pic.twitter.com/TmZfVjIL4H— Pakistan Reality Check (@PakRealityCheck) February 6, 2026


