మాల్దీవులలో పెను‌ప్రమాదం.. రేమండ్ ఎండీకి తప్పిన ప్రాణాపాయం.. ఇద్దరు గల్లంతు!

Date:


India

oi-Jakki Mahesh

మాల్దీవులలో పెనుప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, రేమండ్ గ్రూప్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా మాల్దీవులలో జరిగిన ఓ భారీ బోటు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. పర్యాటకులతో వెళ్తున్న స్పీడ్ బోట్ సముద్రంలో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గౌతమ్ సింఘానియాకు స్వల్ప గాయాలు కాగా.. ఇద్దరు భారతీయులు సముద్రంలో గల్లంతవ్వడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

అసలేం జరిగిందంటే?
శుక్రవారం తెల్లవారుజామున మాల్దీవులలోని వావు అటోల్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు ఏడుగురు ప్రయాణీకులతో వెళ్తున్న స్పీడ్ బోట్.. వి ఫెలిదూ ద్వీపం సమీపంలో ఒక్కసారిగా బోల్తా పడింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.15 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. బోటు తిరగబడటంతో ప్రయాణికులందరూ సముద్రంలో పడిపోయారు.

రేమండ్ ఎండీ గౌతమ్ సింఘానియా సేఫ్
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్, గౌతమ్ సింఘానియాతో పాటు మరికొందరిని సురక్షితంగా బయటకు తీశారు. సింఘానియాకు స్వల్ప గాయాలవ్వడంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన ముంబైకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని సమాచారం.

గల్లంతైన వారిలో దిగ్గజ డ్రైవర్ హరిసింగ్!
ఈ ప్రమాదంలో ఇద్దరు భారతీయ పౌరులు సముద్రంలోనే గల్లంతయ్యారు. వారి కోసం మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ (MNDF) విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టింది. గల్లంతైన వారిలో భారత మోటార్ స్పోర్ట్స్ రంగంలో దిగ్గజంగా పేరుగాంచిన ర్యాలీ డ్రైవర్ హరి సింగ్ ఉన్నట్లు సమాచారం. హరి సింగ్ వంటి ప్రముఖ క్రీడాకారుడు గల్లంతవ్వడంతో క్రీడా, కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రమాదానికి కారణం ఏంటి?
ఈ బోటులో భారతీయులతో పాటు బ్రిటన్, రష్యాకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం అనుకూలించలేదా లేక బోటు నిర్వహణలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో మాల్దీవులలోని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం హెలికాప్టర్లు, రెస్క్యూ బోట్లతో సముద్రాన్ని జల్లెడ పడుతున్నారు. ఓ వైపు గౌతమ్ సింఘానియా క్షేమంగా తిరిగిరావడంతో రేమండ్ గ్రూప్ ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. హరి సింగ్ ఆచూకీ ఇంకా లభించకపోవడం అందరినీ కలవరపెడుతోంది. గల్లంతైన వారు క్షేమంగా తిరిగి రావాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related