మూడుసార్లు విషమిచ్చినా చావలేదని.. కిరాతక భర్త దారుణం!

Date:


India

oi-Jakki Mahesh

భార్యను వదిలించుకోవాలని ఓ భర్త వేసిన కిరాతక ప్లాన్ విచారణలో వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ భర్త తన భార్యపై చూపించిన క్రూరత్వం సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మూడు సార్లు విషమిచ్చి చంపాలని చూసినా కుదరకపోవడంతో చివరకు రోడ్డు ప్రమాదం సృష్టించి ఆమెను అంతమొందించిన ఘటన దేశాన్ని కలవరపరుస్తోంది. నిందితుడు ప్రకాష్ గవాండే తన భార్య వృషాలిని వదిలించుకోవడానికి గత కొంతకాలంగా పథకాలు వేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగా ఆమెకు తెలియకుండానే ఆహారంలో విషం కలిపి ఏకంగా మూడు సార్లు చంపడానికి ప్రయత్నించాడు. అయితే విధివశాత్తూ ఆ మూడు సార్లు వృషాలి ప్రాణాపాయం నుంచి బయటపడింది. విషం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ప్రకాష్ తన పద్ధతి మార్చి ఎలాగైనా ఆమెను అంతమొందించాలని మరింత ఘోరమైన ప్లాన్ వేశాడు.

లక్ష రూపాయల సుపారీ.. ప్రమాద నాటకం
విష ప్రయోగాలు విఫలం కావడంతో ప్రకాష్ ఓ కిరాయి హంతకుడిని ఆశ్రయించాడు. మంగేష్ చుల్కర్ అనే వ్యక్తికి తన భార్యను చంపడానికి లక్ష రూపాయలు సుపారీగా ఇచ్చాడు. ఇది పక్కాగా రోడ్డు ప్రమాదంలా కనిపించాలని.. ఎవరికీ అనుమానం రాకూడదని షరతు విధించాడు. ఈ ఒప్పందం ప్రకారం, మంగేష్ తన డ్రైవర్ మనీష్ సూర్యవంశీని పురమాయించాడు. మార్చి 2వ తేదీన వృషాలి తన స్కూటర్‌పై పాఠశాలకు వెళ్తుండగా.. నిందితులు టాటా ఇంట్రా వాహనంతో ఆమెను వెంబడించి, జనం లేని చోట అత్యంత వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాద ధాటికి వృషాలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

నిశితంగా పరిశీలించిన పోలీసులు.. బయటపడిన అసలు నిజం
ప్రమాదం జరిగిన తీరును చూసి మొదట పోలీసులు కూడా ఇది హిట్ అండ్ రన్ కేసు అని భావించారు. కానీ ఘటనా స్థలంలో లభించిన సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించినప్పుడు ఒక వాహనం వృషాలిని చనిపోయే వరకు అనుసరించడం పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఆ వాహన యజమాని మనీష్ సూర్యవంశీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. అసలు గుట్టు రట్టయింది. భార్యను వదిలించుకోవడానికి భర్త వేసిన కిరాతక ప్లాన్ విని పోలీసులే విస్తుపోయారు.

నిందితుల అరెస్ట్
దర్యాప్తులో తేలిన వివరాల ఆధారంగా పోలీసులు భర్త ప్రకాష్ గవాండేతో పాటు మధ్యవర్తి మంగేష్ చుల్కర్, డ్రైవర్ మనీష్ సూర్యవంశీలను అరెస్ట్ చేశారు. వీరిపై హత్య, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు. కోర్టు వీరికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. కేవలం కుటుంబ కలహాల కారణంగానే ఒక వ్యక్తి తన భార్యను అంతమొందించడానికి ఇన్ని ప్రయత్నాలు చేయడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఒక సాధారణ ప్రమాదంగా ముగిసిపోవాల్సిన ఈ కేసును పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related