India
oi-Bomma Shivakumar
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. రెండు వారాలుగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా అనేక కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులు దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. అలాగే లెబనాన్ రాజధాని బీరుట్ పైనా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ తో పాటు అమెరికా సైనిక స్థావరాలే టార్గెట్ గా ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు రూ.33,660 కోట్లతో ‘భారత్ ఆద్యోగిక్ వికాస్ యోజన’ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. భారత్ ను స్వయం సమృద్ధిగా మార్చడమే ఈ పథకం లక్ష్యమని అన్నారు. దాంతోపాటు 100 పెద్ద పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఇక భారత్ లో తయారైన వస్తువులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించడమే లక్ష్యంగా ఉన్న ‘మేక్ ఇన్ ఇండియా’ కు ఇది ఒక విస్తృత రూపమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2023-24 పత్తి సీజన్ MSP రీయింబర్స్ మెంట్ కు రూ. 11,712 కోట్లు కేటాయించిందని అన్నారు. అలాగే NH-92 బారాబంకి నుండి బహ్రైచ్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్గం రూ. 6,969 కోట్లు కేటాయింపులు చేసింది. ఇక చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకానికి రూ. 2,585 కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి 2030-31 వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
అలాగే దేశవ్యాప్తంగా సుమారు 1500 మెగావాట్ల (MW) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా 1 నుంచి 25 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులకు ఈ పథకం కింద మద్దతు లభించనుంది. రాష్ట్రాలకు లభించే ఆర్థిక ప్రోత్సాహకాలు ఈ పథకం ద్వారా కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు మెరుగైన ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.


