Andhra Pradesh
oi-Korivi Jayakumar
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గత నెలలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన పెద్దపులి మరోసారి రిటర్న్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు జనావాసాల సమీపంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రేడియో కాలర్ ద్వారా లభించిన సమాచారం ఆధారంగా ఆ పులి మళ్లీ గ్రామాల వైపు కదులుతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో స్థానిక ప్రజల్లో మరోసారి ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాలు..
ఈ పరిణామాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అటవీ శాఖ మంత్రి Pawan Kalyan దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన అటవీ శాఖ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పులి జనావాసాల్లోకి రాకముందే దాన్ని సురక్షితంగా బంధించి Indira Gandhi Zoological Parkలో విడిచిపెట్టాలని సూచించారు. దాంతో పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాజమండ్రి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో 10 నుంచి 11 ప్రత్యేక “హనుమాన్ బృందాలు” ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో అటవీ అధికారులు, ట్రాకర్లు, వెటర్నరీ నిపుణులు, డ్రోన్ ఆపరేటర్లు ఉన్నారు. వీరిని పులి సంచరిస్తున్న ప్రాంతాలకు పంపించారు.
ఆధునిక సాంకేతిక పరికరాలతో పర్యవేక్షణ..
పులి కదలికలను గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. జీపీఎస్ కాలర్ డేటా, శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్, థర్మల్ డ్రోన్లు, సర్వైలెన్స్ డ్రోన్లు వంటి పరికరాలతో పులి కదలికలను నిరంతరం గమనిస్తున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పులి ఉన్న ప్రాంతాన్ని అంచనా వేస్తూ ట్రాక్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతను అటవీ దళాల అధిపతి P. V. Chalapathi Raoకు అప్పగించారు. ఆయన ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది పులి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. త్వరలోనే పులిని సురక్షితంగా పట్టుకుంటామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అప్రమత్తం చేసిన గ్రామాలు..
పులి కదలికల నేపథ్యంలో ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం మండలాల పరిధిలోని అనేక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా కంబలపాలెం, మర్రివీడు, పరిమితడక, ధారపల్లి, తాడువై, కిథమూరిపేట, ఉల్లిగోగుల, మాసంపల్లి, జి.కొత్తపల్లి, అచ్చెంపేట, మండపం గ్రామాల ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. ఒంటరిగా అటవీ ప్రాంతాల దగ్గరకు వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి వేళల్లో వ్యవసాయ క్షేత్రాలకు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. పులి కనిపించినట్లయితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
పెద్ద పులి సంచారంపై హనుమాన్ బృందాలకు అప్రమత్తత
•సురక్షితంగా బంధించేందుకు 10 బృందాలు నియామకం
•పులి సంచారంపై రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టం సందేశం
•పట్టుకుని విశాఖ జూలో వదలాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆదేశంరాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జనావాసాల మధ్య సంచరించి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 15, 2026
గత ఫిబ్రవరి 6న Kurmapuram వద్ద ఈ పెద్దపులిని అటవీ శాఖ అధికారులు బంధించారు. అనంతరం నిపుణుల సూచన మేరకు పులి మెడలో శాటిలైట్ ఆధారిత రేడియో కాలర్ అమర్చి అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. ఈ కాలర్ ద్వారా పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. హనుమాన్ బృందాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని, ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్థానిక ప్రజలు అటవీ శాఖకు సహకరిస్తే పులిని త్వరలోనే సురక్షితంగా పట్టుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.


