Telangana
oi-Sai Chaitanya
తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. అధికారిక ప్రకటన మాత్రమే పెండింగ్ ఉంది. రాష్ట్రం నుంచి రెండు స్థానాలు కాంగ్రెస్ కే దక్కనున్నాయి. బీఆర్ఎస్ పోటీలో ఉంటుందనే ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకు స్పష్టత లేదు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్ధుల విషయంలో ఒకటి హైకమాండ్ కోటా.. రెండోది రాష్ట్ర పార్టీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా సింఘ్వీకి ఒక సీటు కొనసాగించటం దాదాపు ఖాయమైంది. ఇక.. రెండో సీటు పైన అనేక సమీకరణాలు తెర మీదకు వచ్చాయి. దీని పైన రాహుల్ నిర్ణయం ఫైనల్ అయింది.
తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానాల భర్తీ పైన హైకమాండ్ తుది కసరత్తు చేస్తోంది. అసెంబ్లీలో పార్టీ బలాబలాల ఆధారంగా రెండు స్థానాలు కాంగ్రెస్ కు దక్కనున్నాయి. ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న అభిషేక్ సింఘ్వీకి తిరిగి రెన్యువల్ దాదాపు ఖాయమైంది. రేపు (గురువారం) నామినేషన్ల కు తుది గడువు కావటంతో ఈ రోజు (బుధవారం) అభ్యర్ధుల పైన నిర్ణయం తీసుకోనున్నారు. సింఘ్వీ నామినేషన్ కు సిద్దం అవుతున్నారు. ఇక.. రెండో స్థానం కోసం పలువురు సీనియర్లు రేసు లో ఉన్నారు. అందులో భాగంగా బీసీ, రెడ్డి, దళిత ఆదివాసీ తదితర సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలు రాజ్యసభ స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని పెద్దల సభకు పంపాలని రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కేవీపీ రామచంద్రరావును రాజ్యసభకు పంపి.. పార్టీ హైకమాండ్ – తన కు మధ్య వారధిగా ఉండేలా వ్యవహరించారు. ఇప్పుడు అదే తరహాలో రేవంత్ సైతం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ తనయుడు వినయ్ వైపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
కాగా.. పార్టీ నేతలు వీహెచ్, వంశీచంద్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్ కుమార్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ శ్యామ్ మోహన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, దొమ్మటి సాంబయ్య, బెల్లయ్య నాయక్ తదితరులు రాష్ట్ర కోటా కింద భర్తీ చేయనున్న సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. రాహుల్ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో విమానాశ్రయంలో రాజ్యసభ అభ్యర్ధుల పైన చర్చ జరిగింది. సామాజిక సమీకరణాల లెక్కల మేరకు ఆశావాహుల పేర్లను పార్టీ నేతలకు ఆయనకు అందించారు. రాహుల్ సూచన మేరకు ఈ రోజు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ తుది నిర్ణయం జరగనుంది. ఓసీ కోటాలో ఇవ్వాలనుకుంటే వేం నరేందర్ రెడ్డి, బీసీ కోటాలో అయితే వినయ్ పేర్లు ఖరారయ్యే ఛాన్స్ ఉంది. రేపు నామినేషన్లకు చివరి రోజు కావటంతో.. ఈ రాత్రికి కాంగ్రెస్ అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో.. ఆశావాహులు ఢిల్లీలో తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసారు.


