Andhra Pradesh
oi-Sai Chaitanya
ఇప్పటికే ఈ కామర్స్ ప్లాట్ ఫారాల ద్వారా కూరగాయలు ఇంటికి వస్తున్నాయి. కాగా, కొత్తగా రైతు బజార్ల నుంచి ఇంటికి కూరగాయలు డోర్ డెలివరీ చేయనున్నారు. రైతుబజార్ల ధరలకే డోర్ డెలివరీ చేసేలా కొత్త సదుపాయం కల్పించారు. దీంతో.. కొత్తగా యాప్ ద్వారా రైతుబజార్ వినియోగ దారులకు అందుబాటులోకి వచ్చింది. తొలిగా ఈ విధానం పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో అమలు చేస్తున్న అధికారులు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు.
రైతు బజార్ నుంచి కూరగాయలు అక్కడి ధరలకే డోర్ డెలివరీ చేయనున్నారు. అందులో భాగంగా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు కూడా లాభం చేకూర్చ డానికి ప్రభుత్వ సహకారంతో ‘మాచింట్ సొల్యూషన్స్’ అనే సంస్థ ముందుకొచ్చింది. రైతు బజార్లను ఈ-కామర్స్ ప్లాట్‌ఫారంపైకి తీసుకువచ్చింది. బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు ఎలాగైతే ఆన్‌లైన్‌లో కూరగాయలు, పండ్లను ఆర్డర్ తీసుకొని డోర్ డెలివరీ చేస్తున్నాయో అదే విధానంలో రైతుబజార్ల నుంచి తాజా కూరగాయాలు, పండ్లు, ఇతర నిత్యవసరాలు సరఫరా చేయడానికి మాచింట్ సొల్యూషన్స్ https://digirythubazaarap.com/ అనే వెబ్‌సైట్, యాప్ రూపొందించింది. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఆరోజు రైతుబజార్లలో అందుబాటులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు, వాటి ధరలు కనిపిస్తాయి.
పైలెట్ ప్రాజెక్టు కింద అమలు.. దశల వారీగా విస్తరణ
ఈ యాప్ ద్వారా వినియోగదారుల ఇళ్లకే కూరగాయలు, నిత్యావసరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విశాఖ, గుంటూరు, కాకినాడ జిల్లాల్లో ఆన్‌లైన్ రైతుబజార్లకు శ్రీకారం చుట్టగా, తాజాగా విజయవాడలోనూ యాప్ ద్వారా కార్యకలాపాలు ప్రారంభించారు. అందరికీ డీజీ రైతుబజార్ యాప్ వినియోగంపై అధికారులు ప్రచారం కల్పిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డీజీఆర్బీ యాప్‌ను ముందుగా డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్ నంబర్, చిరునామా వంటివి నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత దగ్గర్లోని రైతుబజార్‌కు ఆర్డర్ చేస్తే నేరుగా కూరగాయలు ఇంటికే రానున్నాయి. కూర గాయలు, ఆకుకూరలు, కొన్ని నిత్యావసర వస్తువులు సైతం ఇంటి వద్దకే అందుతాయి. కనీసం వంద రూపాయలలోపు ఆర్డర్ చేస్తే హ్యాడ్లింగ్ ఛార్జీలు, జీఎస్టీ కలిపి రూ. 49 వరకు ఛార్జీలు వసూలు చేస్తారు. నిర్వహణలో వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు చేసి.. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలుకు కసరత్తు జరుగుతోంది.


