Telangana
oi-Dr Veena Srinivas
రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు శుభవార్త. రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రైతు భరోసా నిధుల పంపిణీ పైన కీలక ప్రకటన చేశారు. మార్చి నెలాఖరు నుంచి రైతుల ఖాతాలలో ఈ నిధులు జమ అవుతాయని మంత్రి వివేక్ వెంకటస్వామి శుభవార్త చెప్పారు. రైతు భరోసాపై రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి వివేక్ వెల్లడించారు.
రైతు భరోసాపై మంత్రి వివేక్ కీలక ప్రకటన
రైతులకు ఇవ్వవలసిన తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను ప్రభుత్వం రెండు విడతలలో విడుదల చేస్తుంది. తొలివిడతగా మార్చి నెలాఖరులో 4,500 కోట్ల రూపాయలు, మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ లో జమ చేయాలని నిర్ణయించింది. ఇక ఇదే విషయాన్ని మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లడించారు.
రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రభుత్వం మొత్తం రూ. 9 వేల కోట్లను రెండు విడతల్లో విడుదల చేస్తుంది. తొలి విడతగా మార్చి నెలాఖరులో రూ. 4,500 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్‌లో జమ చేయనున్నారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని వాటిని నమ్మవద్దని అన్నారు.
సన్న బియ్యం పండించే 90 శాతం మంది రైతులకు బోనస్ ఇస్తున్నాం
ప్రజల ఆరోగ్యం కోసం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సన్న బియ్యం పండించే 90 శాతం మంది రైతులకు బోనస్ కూడా అందిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసిన బాధ్యత మార్కెట్ కమిటీల పైన ఉందని మంత్రి గుర్తు చేశారు. ఐకెపి, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణా సర్కార్
ఇదే సమయంలో గత ప్రభుత్వ విధానాలపైన మండిపడిన వివేక్ వెంకటస్వామి కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని ఆరోపించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోయారని వివేక్ వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంకటస్వామి హయాంలోని ప్రాణహిత ప్రాజెక్టు కోసం 11,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.


