Andhra Pradesh
oi-Sai Chaitanya
లడ్డూ వివాదం రాజకీయ రచ్చగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీటీడీలో లడ్డూ కల్తీ అంశం పై సిట్ విచారణ చేసింది. కీలక అంశాలను గుర్తించింది. కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కాగా.. వైసీపీ నేతలు గతంలో చంద్రబాబు లడ్డూ కల్తీ పై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావన చేస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లుగా యానిమల్ ఫ్యాట్ లేదని.. సిట్ సైతం ఇదే అంశం స్పష్టం చేసిందని చెప్పుకొచ్చారు. కాగా.. ఈ వివాదం కొనసాగుతున్న వేళ మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
టీటీడీ లడ్డూ కల్తీ వివాదం కొత్త మలుపు తీసుకుంది. లడ్డూ కల్తీ పైన గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యల పైన సుబ్రమణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డి సుప్రీంను ఆశ్రయించారు. కోర్టు సిట్ ఏర్పాటు చేసి.. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రంగంలోకి దిగిన సుదీర్ఘ విచారణ చేసింది నెయ్యి సరఫరా చేసిన డెయిరీల నుంచి లడ్డూ తయారీ కేంద్రం వరకు పూర్తి వివరాలు సేకరించింది. వైవీ సుబ్బారెడ్డి పీఏ గా పని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసింది.
ఆర్దిక లావా దేవీల పైన ఆరా తీసింది. అదే విధంగా ప్రభుత్వా నికి ఇచ్చిన నివేదికలో ఈవోలుగా పని చేసిన ధర్మారెడ్డి, అనిల్ కుమార్ సింఘాల్ తో పాటుగా మరి కొందరు అధికారుల పైన చర్యలకు సిఫారసు చేసింది. దీంతో.. ప్రభుత్వం అనిల్ కుమార్ సింఘా ల్ ను టీటీడీ నుంచి బదిలీ చేసి.. ముద్దాడ రవిచంద్రకు బాధ్యతలు అప్పగించింది. కాగా.. కూటమి నేతలు వరుసగా వైసీపీని కల్తీ నెయ్యి వివాదంలో టార్గెట్ చేస్తున్నారు.
సుప్రీంకోర్టుకు వెళ్లాలని జగన్ నిర్ణయం
కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరి కాదని.. సిట్ నివేదిక స్పష్టం చేస్తుందని వైసీపీ వాదిస్తోంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకు వెళ్లారని.. ఆ సమయంలోనే విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసారని గుర్తు చేసారు. కాగా.. ఇప్పుడు సిట్ వివేదికలో చంద్రబాబు చెప్పిన అంశాలు నిజం కాదని తేలిందని పేర్కొన్నారు. దీని కారణంగానే ఇప్పుడు ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటు చేస్తుందని విమర్శించారు.
తిరుమల లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీంతో.. సిట్ నివేదిక.. ప్రభుత్వంలోని ముఖ్యులు చేస్తున్న వ్యాఖ్యలు తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని జగన్ ప్రకటించారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో సూత్రధారులను తేల్చేందుకు ఏకసభ్య కమిషన్ నియమించాలని నిర్ణయించింది. ఇప్పుడు మరోసారి సుప్రీంకు వెళ్లాలనే జగన్ నిర్ణయం.. విచారణ కోసం ప్రభుత్వం మరో కమిటీ ఏర్పాటుతో ఈ వ్యవహారం ఎటు వైపు టర్న్ అవుతుందనేది ఉత్కంఠ పెంచుతోంది.


