Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లడ్డూ కల్తీ వ్యవహారం రాజకీయం గా పతాక స్థాయికి చేరింది. ఇప్పటికే సిట్ ఈ అంశం పైన విచారణ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కాగా, ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ మొదలు పెట్టింది. ఈ అంశం పైన తాజాగా మిత్రపక్షాలైన పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో సీఎం చంద్రబాబు ప్రత్యేకం గా చర్చించారు. ఇటు వైసీపీలోనూ కీలక నేతల కసరత్తు కొనసాగుతోంది. దీంతో.. ఇప్పుడు ఈ అంశం పైన ఈ రోజు చోటు చేసుకొనే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
తిరుమల లడ్డూ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. అటు సుప్రీం ఆదేశాల మేరకు విచారణ చేసిన సిట్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అందులో పేర్కొన్న అంశాల పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాగా.. ప్రభుత్వం దినేశ్ కుమార్ తో కీలక అంశాల విచారణ కోసం ఏక సభ్య కమిటీ నియమించింది. ఈ కమిటీ నియామకం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుబ్రమణ్య స్వామి సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసారు. విచారణ చేసిన సుప్రీంకోర్టు సిట్, ఏకసభ్య కమిటీ ఒకరి విచారణ మరొకరి పైన ప్రభావం చూపకుండా చట్టానికి లోబడి తమ విధులు పూర్తి చేయాలని నిర్దేశించింది. దీంతో, తిరుమల కేంద్రంగా విచారణ మొదలు పెట్టింది. ఇదే సమయంలో ఈ అంశం పైన ఈ రోజు శాసన మండలిలో చర్చ జరగనుంది. ఇందులో ప్రధానంగా హెరిటేజ్ – ఇందా పూర్ సంబంధాల పైన వైసీపీ నేతలు చర్చ కోసం పట్టుబట్టారు. మండలిలో ఈ అంశం పైన చర్చకు ప్రభుత్వం సిద్దమని ప్రకటించింది. కాగా.. సభలో చోటు చేసుకున్న పరిణామాలు.. ప్రభుత్వం ప్రకటన.. వైసీపీ చర్చ… ఛైర్మన్ రూలింగ్ తో ఈ వ్యవహారం వాయిదా పడింది.
మండలిలో చర్చ వేళ కీలక పరిణామాలు
సెలవుల తరువాత ఈ రోజు తిరిగి ప్రారంభం అవుతున్న మండలి సమావేశాల్లో ఈ అంశం పైన చర్చకు సిద్దంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం పై చర్చ కు వైసీపీ డిమాండ్ చేస్తున్న వేళ నేరుగా ప్రభుత్వమే స్టేట్మెంట్ ఇస్తుందా.. లేక చర్చ కు సిద్ధమవుతుందా అనేది తేలాల్సి ఉంది. తిరుమల లడ్డు వ్యవహారం పై చర్చించేలా మండలి చైర్మన్ రేపటికి వాయిదా వేసిన నేపథ్యంలో మండలి లో వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మండలిలో విపక్ష నేత బొత్సా అస్వస్థతకు గురి కావటంతో.. ఆయన హాజరు పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో వైసీపీ సభ్యులు ఇప్పటికే జగన్ తో సమావేశం అయ్యారు. చర్చలో ప్రస్తావించాల్సిన అంశాల పైన చర్చించారు. అటు చంద్రబాబు – పవన్ భేటీలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. సభలో వైసీపీని దీటుగా ఎదుర్కొనేలా కూటమి సభ్యులకు దిశానిర్దేశం చేయాలని ఉభయులూ నిర్ణయించారు. దీంతో.. ఈ రోజు మండలి వేదికగా లడ్డూ వ్యవహారం లో చోటు చేసుకునే చర్చ.. పరిణామాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.


