News
oi-Suravarapu Dileep
Laptop Battery Health: ఈ రోజుల్లో స్కూల్ పిల్లల నుంచి ఆఫీస్ ఉద్యోగుల వరకు అందరికీ ల్యాప్‌టాప్ నిత్యవసర వస్తువుగా మారిపోయింది. వాళ్లు గంటల తరబడి ల్యాప్‌టాప్ ముందు గడపాల్సి వస్తుంది. చాలామంది ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఛార్జింగ్ సాకెట్‌కు కనెక్ట్ చేసే ఉంచుతారు. అయితే, ఇలా 24 గంటలు ప్లగ్-ఇన్ చేసి ఉంచడం వల్ల బ్యాటరీ పేలిపోతుందా? లేక త్వరగా పాడైపోతుందా? అనే అనుమానం ఉంటుంది. దీనిపై టెక్ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
పాత భయాలు వద్దు..
ఒకప్పుడు ఛార్జింగ్ ఎక్కువైతే బ్యాటరీ కాలిపోతుందేమో (“Fries” the battery) అనే భయం ఉండేది. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న విండోస్, మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్స్ చాలా తెలివైనవి. వీటిలోని పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. కాబట్టి గంటల తరబడి ప్లగ్ ఇన్ చేసి ఉన్నా, బ్యాటరీకి ఎలాంటి హాని కలగదు.
100% ఛార్జింగ్ అయ్యాక ఏం జరుగుతుంది?
మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ 100% నిండగానే డివైజ్ ఆటోమేటిక్‌గా బ్యాటరీ నుంచి పవర్ తీసుకోవడం ఆపేస్తుంది. నేరుగా ఏసీ అడాప్టర్ (AC Adapter) నుంచి వచ్చే కరెంట్‌తోనే ల్యాప్‌టాప్ రన్ అవుతుంది. అది ఒక డెస్క్‌టాప్ కంప్యూటర్ లాగా మారుతుంది. ఛార్జింగ్ సర్క్యూట్ ఆగిపోతుంది కాబట్టి, ‘ఓవర్ ఛార్జింగ్’ అనే సమస్యే ఉండదు. బ్యాటరీ అలా రెస్ట్ తీసుకుంటుంది.
అసలు శత్రువు వేడి మాత్రమే..
బ్యాటరీ హెల్త్ అనేది ‘ఛార్జ్ సైకిల్స్’ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాటరీని 0 నుంచి 100 శాతం వాడితే ఒక సైకిల్ పూర్తయినట్లు లెక్క. ఇలా వాడే కొద్దీ బ్యాటరీ అరుగుదల (Wear and tear) మొదలవుతుంది. మీరు ఛార్జింగ్ పెట్టి వాడటం వల్ల ఈ సైకిల్స్ ఆదా అవుతాయి, తద్వారా బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
కానీ, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అసలు శత్రువు ‘వేడి’ (Heat). ల్యాప్‌టాప్ బాగా వేడెక్కితే మాత్రం బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
బ్యాటరీ ఉబ్బిపోతుందనేది అపోహేనా?
అప్పుడప్పుడు బ్యాటరీలు ఉబ్బిపోయిన (Swollen batteries) వార్తలు చూసి భయపడుతుంటాం. కానీ నిపుణుల ప్రకారం.. ఇది పాత టెక్నాలజీ ల్యాప్‌టాప్స్‌లో లేదా హార్డ్‌వేర్ లోపాలు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ల్యాప్‌టాప్స్‌లో ఓవర్ హీటింగ్ కాకుండా అనేక రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి. సాధారణ వాడకంలో ఈ సమస్య రాదు.
బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి..
మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నాలంటే ఈ సింపుల్ అలవాట్లు చేసుకోండి. మీరు ఒకే చోట కూర్చుని పని చేస్తుంటే, ఛార్జింగ్ ప్లగ్ చేసి వాడటమే ఉత్తమం. దీనివల్ల బ్యాటరీ సైకిల్స్ వృధా కావు. ఎప్పుడూ కూడా ఛార్జింగ్ 0% అయ్యేవరకు వాడకూడదు. పూర్తిగా డ్రైన్ అయితే లిథియం సెల్స్ దెబ్బతింటాయి.
డెల్, హెచ్‌పీ, లెనోవో, ఏసుస్ వంటి కంపెనీలు బ్యాటరీ 80-90% వరకే ఛార్జ్ అయ్యేలా సెట్టింగ్స్ ఇస్తాయి. దీన్ని ఆన్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ల్యాప్‌టాప్ ఫ్యాన్ గాలి బయటకు వెళ్లే దారులు (Vents) మూసుకుపోకుండా చూసుకోవాలి. మంచం మీద పెట్టి వాడటం తగ్గించి, కూలింగ్ స్టాండ్ వాడటం మంచిది.
హెవీ వర్క్ అప్పుడు అంటే గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ల్యాప్‌టాప్ బాగా వేడెక్కుతుంది. అప్పుడు కాసేపు ప్లగ్ తీసేయడం మంచిది. ల్యాప్‌టాప్‌ను రోజంతా ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల ప్రమాదం లేదు, పైగా డెస్క్ వర్క్ చేసేవారికి అది బ్యాటరీకి మంచిదే. కాబట్టి ధైర్యంగా ప్లగ్ ఇన్ చేసి వాడుకోవచ్చు. కేవలం ల్యాప్‌టాప్ వేడెక్కుతుందా లేదా అనేది గమనించుకుంటే చాలు.
Best Mobiles in India
Story first published: Wednesday, December 10, 2025, 11:14 [IST]


