Andhra Pradesh
oi-Sai Chaitanya
వంట గ్యాస్ సంక్షోభం వేళ సీఎం చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పైన ఆరా తీసారు. కొరత వార్తల వేళ గ్యాస్ కోసం వినియోగదారులు ముందస్తుగానే బుకింగ్స్ చేసు కొంటున్నారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా దాదాపు నిలిచిపోయింది. హోటల్స్ చాలా వరకు మూసి వేసారు. కొనసాగుతున్న హోటల్లు ధరలు పెంచేసాయి. ఈ క్రమంలో మొత్తం పరిస్థితి పైన సమీక్ష చేసిన చంద్రబాబు కీలక మార్గ నిర్దేశం చేసారు.
రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై పలువురు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM ఈరోజు(శనివారం) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్యాస్ సరఫరా అంశంపై వివరంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి మంత్రి పయ్యావుల కేశవ్ వివ రించారు. గ్యాస్ సరఫరా అంశంపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ భేటీ అవుతున్నట్లు సీఎంకు మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో, ఎంత చేయాలో అంతా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అన్ని ఎఫర్ట్స్ పెట్టి సమస్య లేకుండా ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశించారు. హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు సూచనలు ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా చూడాలని మంత్రులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మంత్రివర్గ ఉప సంఘం సమీక్ష.. నిర్ణయాలు
ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు ఉన్నారు. ఈరోజు సివిల్ సప్లై భవనంలో మంత్రుల సమావేశం జరగనుంది. కాగా.. ఇప్పటికే హోటల్స్ అసోసియేషన్ నేతలు ప్రభుత్వంతో చర్చలు చేసారు. అంతకు ముందు సమావేశమైన వారంతా ప్రతీ సోమవారం హోటల్స్ హాలిడే అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం తమకు కమర్షియల్ సిలిండర్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటు ప్రభుత్వం సైతం రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ కు ఎలాంటి ఇబ్బంది లేదని… కమర్షియల్ సిలిండర్లలోనే కొంత సమస్య ఉందని చెబుతోంది. ఆస్పత్రులు.. హాస్టల్స్ కు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా చర్యలు చేపడుతోంది. అయితే, గ్యాస్ అందక పలు ప్రాంతాల్లో హోటల్స్ మూసి వేసారు. కొనసాగుతున్న చోట ధరలు పెంచారు. కాగా.. ఇళ్లకు వినియోగించే గ్యాస్ సరఫరాలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.


